రోడ్లపైనే నిద్ర.. అదో అంటువ్యాధట!

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. జపాన్‌లోని ఓ ప్రాంతం మరో అంటువ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘రోజో-ని(రోడ్డుపైనే పడుకోవడం)’అనే వ్యాధి అక్కడి ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రజలను అదుపు చేయలేక

Published : 18 Aug 2020 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. జపాన్‌లోని ఓ ప్రాంతం మరో అంటువ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘రోజో-ని(రోడ్డుపైనే పడుకోవడం)’అనే వ్యాధి అక్కడి ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రజలను అదుపు చేయలేక పోలీసులు ప్రతి రోజు తంటాలు పడుతున్నారట.

మందుబాబులకు మద్యం ఎక్కువై రోడ్ల పక్కన పడిపోవడం సర్వసాధారణ విషయమే. కానీ జపాన్‌లోని ఒకినవా ప్రాంతంలో మద్యం తాగినా, తాగకపోయినా రాత్రుళ్లు చాలా మంది రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడుకోవడం మొదలుపెట్టారట. అలా నడి రోడ్లపై పడుకునేవాళ్లతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వారిని ఢీ కొడతామోనని భయపడుతున్నారు. ప్రమాదం జరిగి రోడ్లపై పడుకున్నవారి ప్రాణాలు సైతం పోయిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే ఎవరైనా అలా పడుకోవడం కనిపించగానే వాహనదారులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని వారిని తీసుకెళ్తున్నారు. గత ఏడాది ఇలా రోడ్లపై పడుకునే వారిపై నమోదైన కేసుల సంఖ్య 7వేలకు పైగా ఉందట. పోలీసులు దీనిని ‘రోజో-ని’ స్థానిక అంటువ్యాధిగా భావిస్తున్నారు.

ఒకినవాలో కొన్నేళ్ల కిందట వెలుగుచూసిన ఇలాంటి ఘటన రానురాను అంటువ్యాధిలా మారిందట. ఈ వ్యాధి ఎలా వచ్చిందో.. ఎప్పుడు వచ్చిందో కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పోలీసులు అంటున్నారు. ఈ అంటు వ్యాధి వల్ల మగవారితోపాటు ఆడవాళ్లూ రాత్రుళ్లు రోడ్లపై పడుకుంటున్నారు. ఇందుకు గల కారణాలపై పలు వాదనలు వినిపిస్తున్నారు. కొందరు కేవలం మద్యం సేవించడం వల్లే ఇలా చేస్తున్నారని, మరికొందరు వాతావరణం ఏడాది పొడువునా వేడిగా ఉండటంతో చల్లదనం కోసం రోడ్లపై పడుకుంటున్నారని వాదిస్తున్నారు. దీనిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై పడుకునే వారిపై కేసు నమోదు చేయడంతోపాటు 470 డాలర్ల జరిమానా విధిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ఇలాంటి ఘటనలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయట. దీనికి తగిన పరిష్కారం కోసం అక్కడి అధికార యంత్రాంగం పరిశోధనలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని