Karnataka: కర్ణాటక ఎన్నికలకు మోగనున్న నగారా.. వయనాడ్‌కూ షెడ్యూల్ ప్రకటిస్తారా?

Karnataka Assembly elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నేడు షెడ్యూల్‌ ప్రకటించనుంది. దీంతో పాటు రాహుల్‌ అనర్హతతో ఖాళీ అయిన వయనాడ్‌ స్థానానికీ ఉప ఎన్నిక తేదీని ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated : 29 Mar 2023 10:08 IST

దిల్లీ: దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly elections) నేడు నగారా మోగనుంది. ఈ శాసనసభకు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ ఉదయం 11.30 గంటలకు ఈసీ (Election Commission) మీడియా సమావేశం నిర్వహించనుంది. అందులో ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నట్లు ఈసీ కార్యాలయం తెలిపింది. (Karnataka Assembly elections)

కర్ణాటక (Karnataka)లో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనుంది. అంతకంటే ముందుగానే అంటే... ఏప్రిల్‌లో ఎన్నికలను నిర్వహించనున్నారు. షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ.. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల జోరు పెంచాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేశాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో తొలుత భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేక.. మూడు రోజులకే యడ్డీ సీఎం కుర్చీ నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఏడాదిలోపే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆ సర్కారు కూడా కూలిపోయింది. ఆ తర్వాత భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో భాజపా సంఖ్యాబలం 119గా ఉండగా.. కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా వ్యూహాలు రచిస్తుండగా.. రాష్ట్రాన్ని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని హస్తం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

వయనాడ్‌కూ షెడ్యూల్‌..

ఇదిలా ఉండగా.. రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అనర్హతతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్‌ (Wayanad) లోక్‌సభ స్థానానికీ నేడు షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో వయనాడ్‌ స్థానం ఖాళీ అయ్యింది. అయితే, కోర్టు తీర్పుపై రాహుల్ ఇంకా పై కోర్టుల్లో సవాల్‌ చేయకముందే.. ఈసీ ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వయనాడ్‌తో పాటు పంజాబ్‌లోని జలంధర్‌ లోక్‌సభ స్థానానికి షెడ్యూల్ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జలంధర్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కాంగ్రెస్‌ నేత సంతోఖ్‌ సింగ్‌ ఛౌదరీ ఈ ఏడాది జనవరిలో జోడో యాత్రలో నడుస్తుండగా గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని