Karnataka: ‘కరవు వేళ.. లగ్జరీ విమానంలో ప్రయాణమా?’.. సిద్ధరామయ్యపై భాజపా ఫైర్‌!

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు కలిసి ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న వేళ.. కాంగ్రెస్‌ నేతలు లగ్జరీ విమానంలో విహరిస్తున్నారంటూ భాజపా మండిపడింది.

Updated : 22 Dec 2023 16:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఓ ప్రైవేటు జెట్‌లో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాష్ట్రం కరవు పరిస్థితులు ఎదుర్కొంటుంటే.. మరోవైపు సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు మాత్రం ప్రైవేటు జెట్‌లో విహరిస్తున్నారంటూ ప్రతిపక్ష భాజపా (BJP) విరుచుకుపడింది. సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారంటూ మండిపడింది. వీడియోలో కర్ణాటక ముఖ్యమంత్రితోపాటు మంత్రులు జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌, కృష్ణ బైరేగౌడ తదితరులున్నారు.

‘‘రాష్ట్రం మొత్తం తీవ్ర కరవుతో అల్లాడుతోంది. వర్షాభావ పరిస్థితులతో పంటలు కోల్పోయి.. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. మరోవైపు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం, రాష్ట్ర మంత్రులు వారి సంపన్న, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తున్నారు. పైగా.. కేంద్రం నుంచి కరవు సహాయక నిధుల అభ్యర్థన కోసం దిల్లీకి వెళ్లేందుకు విలాసవంతమైన విమానంలో ప్రయాణించడం గమనార్హం. మన దురవస్థను అపహాస్యం చేయడమే ఇది. పన్ను చెల్లింపుదారుల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం కాంగ్రెస్‌ మంత్రులకు చాలా సులభం!’’ అని భాజపా కర్ణాటక అధ్యక్షుడు బీవై విజయేంద్ర ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు.

అప్పుడు భాజపా ఎంపీలు పారిపోయారు: రాహుల్ గాంధీ

ఈ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రయాణిస్తారు? ఏ విమానంలో రాకపోకలు సాగిస్తారు? భాజపా నేతలను ఈ ప్రశ్నలు అడగండి’’ అంటూ మీడియాతో చెప్పారు. భాజపా నేతలు ఎప్పుడూ అసంబద్ధ వాదనలు చేస్తుంటారని పేర్కొన్నారు. అంతకుముందు.. మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు