Yediyurappa: బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై పోక్సో కేసు నమోదు

Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

Updated : 15 Mar 2024 11:31 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా (BJP) సీనియర్‌ నేత, కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌. యడియూరప్ప (81) (Yediyurappa)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు.

నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వాళ్లు పోలీసులను ఆశ్రయించగా.. అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది. వారు ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది.

70 ఏళ్లొచ్చినా.. ఇంకా భర్తపై ఆరోపణలా..!

ఖండించిన యడియూరప్ప..

ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ బాలిక, ఆమె తల్లి కొద్ది రోజుల క్రితం నన్ను కలిసేందుకు వచ్చారు. మోసం కేసులో సాయం చేయమని కోరారు. దాని గురించి బాలికతో మాట్లాడుతుంటే ఆమె ఏదీ సరిగా చెప్పలేదు. అప్పుడే ఆమె మానసిక స్థితిపై నాకు అనుమానం వచ్చింది. అయినా సరే పోలీసులను పిలిపించి వారికి అవసరమైన సాయం చేయమని చెప్పా. ఆర్థికంగా ఉపయోగపడుతుందని కొంత డబ్బు కూడా ఇచ్చా. ఇప్పుడు తిరిగి వాళ్లు నాపైనే ఫిర్యాదు చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు’’ అని వెల్లడించారు. ఎన్నికల ముందు ఈ కేసు నమోదవడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

మరోవైపు, ఘటనపై రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర స్పందిస్తూ.. ‘‘ఇది చాలా సున్నితమైన అంశం. దర్యాప్తు జరిగితే గానీ నిజానిజాలు బయటకు రావు. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర కోణం లేదు. బాధితురాలు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని పేర్కొన్నారు.

కర్ణాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడియూరప్ప సీఎం పదవి వీడిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది నవంబరులో ఆ బాధ్యతలను హైకమాండ్‌ ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని