
Karnataka: వాహనం కొనేందుకు వెళ్లిన రైతుకు అవమానం.. గంటలో ₹10లక్షలతో ప్రత్యక్షం
బెంగళూరు: బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు షోరూంకు వెళ్లిన ఓ రైతు వెక్కిరింతలకు గురయ్యాడు. నీకు కారు కొనేంత స్థోమత లేదంటూ సేల్స్‌మెన్ అవమానించి షోరూంలో నుంచి బయటకు వెళ్లిపోమన్నాడు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేని ఆ రైతు.. ఛాలెంజ్ చేసి కొద్ది సమయంలోనే రూ.10 లక్షలతో మళ్లీ ఆ షోరూంలో అడుగుపెట్టాడు. రైతు వద్ద అంత డబ్బు చూసిన సేల్స్‌మెన్ నోట మాటరాలేదు. చివరికి క్షమాపణలు చెప్పాడు. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
రైతు కెంపెగౌడ బొలెరో పికప్ వాహనాన్ని కొనేందుకు శుక్రవారం తుమకూరులోని మహీంద్రా షోరూంకి వెళ్లాడు. అయితే ఆ రైతును అవమానిస్తూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సేల్స్‌మెన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారు ధర ₹10 లక్షలని పేర్కొంటూ ‘నీ వద్ద 10 రూపాయలు కూడా ఉండవు’ అంటూ హేళన చేశాడు. దీంతో వారి మధ్య వాదన మొదలైంది. దీన్ని అవమానంగా భావించిన కెంపెగౌడ.. సేల్స్‌మెన్‌కు ఛాలెంజ్ విసిరాడు. ఓ గంటలో రూ.10 లక్షలతో వస్తానని, వెంటనే వాహనాన్ని డెలివరీ చేయగలరా అంటూ ఛాలెంజ్ చేసి వెళ్లిపోయాడు.
చెప్పినట్లుగానే ఓ గంటలో ఆ మొత్తం డబ్బుతో షోరూంలో ప్రత్యక్షమయ్యాడు. రైతు వద్ద ఆ డబ్బు చూసిన సేల్స్‌మెన్ కంగుతిన్నాడు. వెయిటింగ్ లిస్ట్ ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని సిబ్బంది పేర్కొన్నారు. కనీసం నాలుగు రోజులు పట్టొచ్చని తెలిపారు. కాగా దురుసుగా ప్రవర్తించిన సేల్స్‌మెన్ క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడతోపాటు అతని స్నేహితులు డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ వారిమధ్య వాగ్వాదం చెలరేగింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. రంగంలోని దిగిన వారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకొని ఆ సేల్స్‌మెన్‌తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు.
అయితే చివర్లో ఆ రైతు షాకిస్తూ.. మీ షోరూంలో నుంచి వాహనాన్ని కొనబోనని తెగేసి చెప్తూ తీసుకొచ్చిన డబ్బుతో తిరిగి వెళ్లిపోయాడు. కాగా ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్ ఖాతాకు ఈ వీడియోలను కొందరు ట్యాగ్ కూడా చేశారు.