Karnataka: చంపేస్తానంటూ మంత్రి బెదిరింపులు.. కుటుంబం ఆత్మహత్యాయత్నం!

కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేస్తానంటూ హత్యా బెదిరింపులకు పాల్పడ్డ కర్ణాటక మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.......

Published : 01 Sep 2022 02:47 IST

బెంగళూరు: కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేస్తానంటూ హత్యా బెదిరింపులకు పాల్పడ్డ కర్ణాటక మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్‌ సింగ్‌ హత్యా బెదిరింపుల కారణంగా ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో.. మంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు పలు కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు బుధవారం వెల్లడించారు.

కర్ణాటక హోస్పేటలోని షెడ్యూల్డ్ కులానికి చెందిన డి.పోలప్ప కుటుంబానికి, ఓ సామాజిక వర్గానికి కొద్దికాలంగా భూసంబంధిత గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆనంద్‌ సింగ్‌ మంగళవారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. ఈ భూసమస్యపై సదరు సామాజికవర్గ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలప్పను పిలిపించిన మంత్రి.. అతడిని తీవ్రంగా హెచ్చరించారు. ఆ భూమి జోలికివస్తే కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేస్తానంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలోనే పోలప్పతోపాటు మరో నలుగురు కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్‌ వద్దకు వెళ్లి.. పోలీసుస్టేషన్‌ ఎదురుగానే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. పోలప్ప ఫిర్యాదు మేరకు మంత్రి ఆనంద్‌ సింగ్‌తోపాటు మరో ముగ్గురిపైనా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ ఐదుగురిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని