Lata Mangeshkar: లత పాడిన వాటిల్లో ఆ పాట నాకు చాలా ఇష్టం: ఎల్‌.కె.ఆడ్వాణీ

లతా మంగేష్కర్‌ ఆలపించిన ‘రామ్‌ భజన’ తన చరిత్రాత్మక రథయాత్రకు ‘సిగ్నేచర్‌ ట్యూన్‌’గా మారిందని భాజపా సీనియర్ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ అన్నారు....

Published : 07 Feb 2022 01:35 IST

దిల్లీ: లతా మంగేష్కర్‌ ఆలపించిన ‘రామ్‌ భజన’ తన చరిత్రాత్మక రథయాత్రకు ‘సిగ్నేచర్‌ ట్యూన్‌’గా మారిందని భాజపా సీనియర్ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ అన్నారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మాజీ ఉప ప్రధాని.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె పాడిన పాటల్లో తనకు నచ్చిన ఓ గీతాన్ని తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా లతా మంగేష్కర్‌ను ఆరాధించారని ఆడ్వాణీ తెలిపారు. ఆమెను ఈ దేశం నిజంగా మిస్‌ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నచ్చిన గాయకుల్లో లత ముందుంటారని పేర్కొన్నారు. ఆమెతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని.. అది తన అదృష్టమని వ్యాఖ్యానించారు. సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాలని సంకల్పించినప్పుడు లత స్వయంగా రామ్‌ భజన ఆలపించి తనకు పంపారని ఆడ్వాణీ గుర్తుచేసుకున్నారు. ‘‘రామ్‌ నామ్‌ మే జాదూ ఐసా.. రామ్‌ నామ్‌ మన్‌ భాయే.. మన్‌ కీ అయోధ్య తబ్‌ తక్‌ సూనీ, జబ్‌ తక్‌ రామ్‌ నా ఆయే’’ అంటూ సాగే చిరస్మరణీయ భజన తన రథయాత్రకు సిగ్నేచర్‌ ట్యూన్‌గా మారిందని తెలిపారు. 1990లో సాగిన రథయాత్ర.. భాజపాకు ప్రజల్లో విశేష ఆదరణను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణ డిమాండ్‌ కూడా ఈ యాత్రతోనే ఊపందుకుంది. 

లతా మంగేష్కర్‌ నిర్మలమైన మనస్తత్వం గలవారని ఆడ్వాణీ గుర్తుచేసుకున్నారు. ఆమెతో సంభాషించిన ప్రతిసారీ తనకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు అందాయని తెలిపారు. ఆమె నిరాడంబరత, ప్రేమ తన హృదయాన్ని కదిలించాయన్నారు. ఆమె ఆలపించిన వేల సినిమా పాటల్లో ‘జ్యోతి కలశ్‌ ఛల్‌కే’ తనకు చాలా ఇష్టమని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు అనేక కార్యక్రమాల్లో లత ఈ పాటను పాడి వినిపించారని గుర్తుచేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని