Lemon: సామాన్యుడి జేబుని పిండేస్తున్న ‘నిమ్మ’.. ధరలు మండిపోతున్నాయ్‌!

ఈ వేసవిలో తీవ్ర ఎండలతో పాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలూ సామాన్యుడికి మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇంధనం, గ్యాస్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండగా........

Published : 03 Apr 2022 01:44 IST

రాజ్‌కోట్‌: ఈ వేసవిలో తీవ్ర ఎండలతో పాటు మార్కెట్లో నిత్యావసరాల ధరలూ సామాన్యుడికి మంట పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇంధనం, గ్యాస్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండగా.. వేసవిలో తరచూ వాడే నిమ్మకాయల ధరలూ ఆకాశాన్నంటడం ఆందోళన రేపుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కిలో నిమ్మ ధర ఏకంగా రూ.200లు పలుకుతోంది. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేకపోవడంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. గత సీజన్‌లో రూ.50-60లుగా ఉన్న నిమ్మ ధరలు ఇప్పుడు ఏకంగా రూ.200ల మార్కును తాకడంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిమ్మ ధరలు పెరగడం వంటింటి బడ్జెట్‌పై ప్రభావం చూపుతోందని ఓ వినియోదారుడు వాపోయారు. ఈ ధరలు ఎప్పుడు దిగివస్తాయో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, ప్రకాశం జిల్లా కనిగిరి గత నెలలో మొదటి రకం నిమ్మ కిలో ధర రూ.60 నుంచి ఏకంగా 90-100కి పెరిగింది. రెండో రకమైతే 80 నుంచి 90 వరకు పలికింది. పండ్లు కూడా రూ.65 నుంచి 80 వరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అయితే, ఒక్కో నిమ్మ కాయను రూ.5 నుంచి 7లకు విక్రయిస్తుండటం గమనార్హం.

వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రజలు తమ డైట్‌లో నిమ్మకాయల్ని విరివిగా వాడుతుంటారు. దీంట్లో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉండటంతో పాటు జీర్ణక్రియ సరిగా పనిచేసేలా, శరీరాన్ని హైడ్రేటడ్‌గా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. దీంతో పెరిగిన వినియోగం పెరగడం, సరఫరాలో కొరత కారణంగా నిమ్మ ధరలు క్రమంగా ఆకాశాన్నంటుతున్నాయి. 

‘‘ఇప్పటికే దాదాపు అన్ని కూరగాయల ధరలూ పెరిగిపోయాయి. ఇప్పుడు నిమ్మ ధర కూడా అనుకున్నదానికన్నా ఎక్కువగానే ఉంది. ఇంత ఖరీదైన కాయగూరల్ని కొనుగోలు చేయడం మధ్యతరగతి వినియోగదారులకు కష్టమే. గతంలో కొన్నట్టుగా ఇప్పుడు పెద్ద పరిమాణంలో నిమ్మకాయల్ని కొనలేకపోతున్నాం. గతేడాది మార్చిలో ఖర్చు చేసిందానికన్నా రెట్టింపు స్థాయిలో పెరిగిపోయాయి. ఏప్రిల్‌- మే నెలలో ఇంకా ఈ ధరలు ఎంత ఉంటాయో’’ అని ఓ వినియోగదారుడు ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘గతంలో వారానికి కిలో నిమ్మకాయల్ని వాడేవాళ్లం.. ఇప్పుడు ధరలు పెరగడంతో పావు కేజీ/అరకేజీ మాత్రమే వాడగలుగుతున్నాం. ఇది మా ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతోంది’’ అని మరో వినియోదారుడు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని