INS Vikrant: సముద్ర ప్రవేశం చేసిన తొలి విమాన వాహక నౌక

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌-విక్రాంత్ సముద్ర ప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో తయారు చేసిన ఈ నౌకకు అక్కడే సముద్ర ప్రవేశం చేయించారు....

Published : 04 Aug 2021 22:48 IST

కొచ్చి: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌-విక్రాంత్ సముద్ర ప్రవేశం చేసింది. కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో తయారు చేసిన ఈ నౌకకు అక్కడే సముద్ర ప్రవేశం చేయించారు. దీని బరువు 40వేల టన్నులు. రూ. 23వేల కోట్లతో తయారు చేసిన ఈ నౌక 2022 ఆగస్టులో అధికారికంగా నౌకాదళంలో చేరనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధం నాటికి మిగ్-29 సూపర్ సోనిక్ యుద్ధ విమానాలు సహా పలు ఆధునిక హెలికాప్టర్‌లను దీని మీద దించి ప్రయోగాలు పూర్తి చేస్తారు. అనంతరం నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెడతారు. దేశీయంగా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌-విక్రాంత్ యుద్ధనౌక పొడవు 263 మీటర్లు కాగా వెడల్పు 63 మీటర్లు. దాదాపు 30 యుద్ధ విమానాలను తీసుకెళ్లగలదు. ఈ నౌకలో మొత్తం 1,500 మంది సిబ్బంది పనిచేయనున్నారు.

ఐఎన్‌ఎస్‌-విక్రాంత్‌ను సముద్ర ప్రవేశం చేయించడం గర్వించదగ్గ విషయమని.. ఇది చరిత్రాత్మకమైన రోజు అని భారత నౌకాదళం పేర్కొంది. దేశీయ పరిజ్ఞానంతో ప్రణాళిక రచించి, నిర్మించిన నౌకను కలిగిన అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా చేరిందని వెల్లడించింది.  ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ప్రవేశంతో హిందూ మహాసముద్ర జలాల్లో గస్తీ మరింత పటిష్ఠం కానుంది. భారత్ వద్ద ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన ఒకేఒక్క విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని