Presidential Election: రాష్ట్రపతి రేసుకు పవార్‌ నో.. తెరపైకి ఆ ఇద్దరి పేర్లు!

Presidential Election:  రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది.

Updated : 15 Jun 2022 18:33 IST

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Election) విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిల్లీలో నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. రాష్ట్రపతి రేసులో దిగేందుకు ఎన్సీపీ అధినేత  శరద్‌పవార్‌ నిరాకరించడంతో మమతా బెనర్జీ మరో ఇద్దరి పేర్లను ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు పవార్‌ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉంటారంటూ కొనసాగిన ఊహాగానాలకు ఈ భేటీతో తెరపడినట్టయింది. మమత ప్రతిపాదనకు పవార్‌ నో చెప్పడంతో ఆమె బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాల్‌కృష్ణ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. ఈ కీలక భేటీలో తొలుత విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్‌ పేరును దీదీ ప్రతిపాదించగా.. ఇంకా తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాల్సి ఉన్నందున ఆయన తిరస్కరించినట్టు సమాచారం.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్ని ప్రతిపక్ష పార్టీలను సమావేశానికి ఆహ్వానించా. కొన్ని పార్టీలు హాజరయ్యాయి. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాం. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ఉండాలని కోరాను. శరద్‌ పవార్‌ పేరును ప్రతిపాదించాను. విపక్షాలన్నీ ఆయన పేరునే ఏకగ్రీవంగా ప్రతిపాదించాయి. అయితే, పోటీకి ఆయన ఆసక్తిగా లేరు. శరద్‌ పవార్‌ ఒప్పుకోకపోతే మరోసారి సమావేశమై చర్చిస్తాం. ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతాం. ఇది మంచి శుభారంభం. కొన్ని నెలల తర్వాత కలిసి ఇలా సమావేశమయ్యాం. మళ్లీ భేటీ అవుతాం. ప్రజాస్వామ్య దేశంలో బుల్డోజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ప్రతి వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని దీదీ అన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు విపక్షాలు జూన్‌ 21 డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈలోపు పలువురు నేతలతో కూడినబృందం సంప్రదింపులు జరపనుంది. శరద్‌ పవార్‌కు తృణమూల్‌ కాంగ్రెస్‌తో పాటు, వామపక్షాలు, కాంగ్రెస్‌, శివసేనతో సహా పలు పార్టీ మద్దతు తెలిపాయి. ఆయన తిరస్కరించడంతో వామపక్షాలు ప్రతిపాదిస్తున్న బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాల్‌కృష్ణ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. 

రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 29తో గడువు ముగియనుంది. 30న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 గడువు విధించగా.. జులై 18న ఎన్నికలు జరగనుండగా.. 21న ఫలితాలు వెలువడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని