Maoist Hidma: హిడ్మా చనిపోలేదు.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై మావోస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ చనిపోలేదని అందులో పేర్కొన్నారు.

Published : 12 Jan 2023 12:55 IST

హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో జరిగిన కాల్పులపై మావోస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ చనిపోలేదని అందులో పేర్కొన్నారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. 

‘‘హిడ్మా సురక్షితంగా ఉన్నాడు. దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు డ్రోన్‌లు, హెలికాప్టర్లతో దాడులు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్ట్‌ పార్టీ నాయకత్వం, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీని దెబ్బతీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రీ పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. దీనిలో భాగంగానే మాపై ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలి’’ అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

హిడ్మా కోసం కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల కిందట సైతం భద్రతా బలగాల ఆపరేషన్‌ నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ-ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా తన అనుచరులతో మకాం వేసినట్లు బలగాలకు తాజాగా సమాచారం అందడంతో బీజాపూర్‌- సుక్మా సరిహద్దులో ధరేలీ-కామరతోగు మధ్య కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని.. ఈ ఘటనలో గాయపడిన భద్రతా బలగాలను తీసుకువచ్చేందుకు వెళ్లిన హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారని.. ఈ ఘటనలోనే హిడ్మా మృతిచెందినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగింది. కానీ దీనిపై రాత్రి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని