Maharashtra: కరోనా ఉద్ధృతి.. మహారాష్ట్రలో మళ్లీ ‘మాస్క్‌’ తప్పనిసరి..!

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం

Published : 04 Jun 2022 12:49 IST

ముంబయి: దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి ఎక్కువవుతోంది. దీంతో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం.. కరోనా కట్టడి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్‌ సెక్రటరీ.. జిల్లా అధికారులకు రాసిన లేఖలో ఆదేశించారు.

రైళ్లు, సినిమాలు, బస్సులు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్ల వంటి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాల్సిందేనని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించింది. మహారాష్ట్రలో ఇటీవలే బీఏ.4, బీఏ.6 సబ్‌ వేరియంట్ కేసులు నమోదవ్వడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరింది.

మూడు నెలల తర్వాత తొలిసారిగా జూన్‌ 1వ తేదీన మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. ముఖ్యంగా ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌తో పాటు, థానే ప్రాంతాల్లో అమాంతం కేసులు పెరిగాయి. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉండటం కలవరపెడుతోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,134 కొత్త కేసులు వెలుగుచూడగా.. మూడు మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 763 కేసులు బయటపడ్డాయి. యాక్టివ్‌ కేసులు మళ్లీ 5వేలు దాటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని