ఇప్పుడు వెళ్తేనే మంచిది: సొంతూళ్లకు కూలీలు

కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు

Published : 08 Apr 2021 15:45 IST

న్యూదిల్లీ: కరోనా మహమ్మారి వివిధ రాష్ట్రాలను వణికిస్తోంది. చాప కింద నీరులా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో పొట్ట చేతపట్టుకుని కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారి పరిస్థితి మళ్లీ అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారు వలస కూలీలు. ఇప్పటికే పలువురు తిరిగి స్వరాష్ట్రాలకు పయనమవుతున్నారు.

అప్పుడు తీవ్ర ఇబ్బందులు

గతేడాది కరోనా మహమ్మారిని అరికట్టడానికి తీసుకున్న కఠిన నిర్ణయాల్లో లాక్‌డౌన్‌ ఒకటి. అయితే, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనిదొరక్క, ఉండేచోటు లేక ఆకలితో అలమటించారు. కొందరు వందల కి.మీ. కాలినడకన సొంతూళ్లకు చేరుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ చాలా మంది నగరాలు, పట్టణాలకు వచ్చి పని చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఉండటంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆయా రాష్ట్రాలు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటిస్తే తమ పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు. మరికొందరు ఇప్పుడే సొంతూళ్లకు వెళ్లిపోతే బాగుంటుందని భావించి నగరాలను వీడుతున్నారు.

‘‘ఇక్కడ ఇరుక్కుపోయే కన్నా, ఇప్పుడు సొంతూరు వెళ్లిపోతేనే మంచిది అనిపిస్తోంది’’ అని బిహార్‌కు చెందిన వలస కూలీ అభిప్రాయపడ్డాడు. దిల్లీ ప్రభుత్వం రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ విధించడంతో పనిదొరక్క వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సూరత్‌, అహ్మదాబాద్‌ల నుంచి పలువురు వలస కూలీలు తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని