Sero survey: దిల్లీలో 90 శాతం మందిలో యాంటీబాడీస్‌.. హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్లేనా?

దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్‌ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. నగరంలోని 90 శాతం మంది యాంటీబాడీస్‌ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది.

Updated : 28 Oct 2021 15:59 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన సీరోలాజికల్‌ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. నగరంలోని 90 శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉన్నట్లు సర్వే రిపోర్టులో తేలింది. సెప్టెంబర్‌ 23 నుంచి నిర్వహించిన ఆరో దశ సీరో సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో భాగంగా 280 వార్డుల్లో 28 వేల శాంపిళ్లను సేకరించారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ మందికిలో సీరో పాజిటివ్‌ వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అయితే, సీరో సర్వేలో దాదాపు 90 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినట్లు చెప్పలేమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ చేపట్టడం వల్లే సీరో పాజిటివ్‌ వచ్చిందని కూడా చెప్పలేమని పేర్కొన్నాయి. ‘‘ఈ స్థాయిలో దిల్లీ ప్రజల్లో యాంటీబాడీస్‌ ఉన్నంత మాత్రం హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పలేం. ఎందుకంటే ఇంత శాతం మందిలో యాంటీబాడీస్‌ ఉండటంతో మరోసారి వైరస్‌ విజృంభించదనాడానికి ఆధారాలేవీ లేవు’’ అని అధికారులు తెలిపారు. అయితే, సెకండ్‌ వేవ్‌ తరహాలో ప్రస్తుతమున్న కొవిడ్‌ వేరియంట్‌ (డెల్టా) అలజడి సృష్టించే అవకాశం లేదని, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే, కొత్త వేరియంట్లపైనా ఈ యాంటీబాడీల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

దిల్లీలో ఏప్రిల్‌- మే మధ్య సెకండ్‌ వేవ్‌ సంభవించింది. దీంతో కొవిడ్‌ కేసులు వణికించాయి. ఆసుపత్రులు కిక్కిరిశాయి. ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులు ఇక్కట్లు పడ్డారు. ప్రస్తుతం కేసులు అదుపులోకి వచ్చాయి. కొవిడ్‌ కేసుల తగ్గుమఖం పట్టిన తర్వాత నిర్వహించిన తొలి సీరో సర్వే ఇదే కావడం గమనార్హం. అంతకుముందు జనవరిలో నిర్వహించిన ఐదో విడత సీరో సర్వేలో 56.13 శాతంమందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని