MSP చట్టం.. హడావుడిగా తేలేం: రైతుల ఆందోళన వేళ కేంద్రమంత్రి వ్యాఖ్యలు

Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధరపై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేమని కేంద్రమంత్రి అర్జున్‌ ముండా అన్నారు. రైతుల ఆందోళనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated : 13 Feb 2024 19:03 IST

దిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (MSP)పై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతన్నలు మంగళవారం చేపట్టిన ‘దిల్లీ చలో’ ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి దిల్లీకి ట్రాక్టర్లతో బయల్దేరిన అన్నదాతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతుల నిరసన (Farmers Protest)పై కేంద్ర మంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్‌పీపై తక్షణమే చట్టం తీసుకురాలేమన్నారు. దీనిపై రైతు సంఘాలు చర్చలకు రావాలని కోరారు.

‘‘కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధర (Minimum Support Price)పై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాల వారితో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అందుకే, రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చల కోసం రావాలి’’ అని అర్జున్‌ ముండా సూచించారు.

‘6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్‌’: సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు

ఈ ఆందోళన అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్‌కేఎం (రాజకీయేతర) నేత జగ్జీత్‌సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సోమవారం చర్చలు జరిపింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటికి మంత్రుల బృందం అంగీకారం తెలపగా.. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని