Published : 09 Jun 2021 19:13 IST

Kim Jong-Un: స్లిమ్‌గా మారిన కిమ్..?

కిమ్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చ

సియోల్‌: బాహ్య ప్రపంచానికి అరుదుగా కనిపించే ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు సంబంధించి ఏ విషయమైనా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈమధ్య ఆయన బరువు తగ్గినట్లు కనిపించిన ఫోటోలు మరోసారి వార్తల్లో నిలిచాయి. దీంతో కిమ్‌కు ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయా? లేదా కావాలనే ఆయన బరువు తగ్గారా..? అనే చర్చ మరోసారి మొదలయ్యింది.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. గతేడాది కొన్ని నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒకానొక సమయంలో కిమ్‌ మృతి చెందారనే వార్తలూ అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో కిమ్‌ పాల్గొన్న ఫోటోలను మీడియా విడుదల చేయడంతో అలాంటి వార్తలకు ముగింపు పలికారు. ఇదిలాఉండగా, ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. అందులో కిమ్‌ చాలా బరువు తగ్గినట్లు కనిపించారు. ఆయన కావాలనే బరువు తగ్గారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడిపోయారా? అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో కిమ్‌ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలయ్యింది. అయితే, కిమ్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో భాగంగానే బరువు తగ్గి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తర కొరియా అధినేతకు సంబంధించిన విషయాలపై పొరుగు దేశం దక్షిణ కొరియా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. గతేడాది దక్షిణ కొరియా నిఘా వర్గాలు వారి ఎంపీలకు ఇచ్చిన నివేదిక ప్రకారం, కిమ్‌ బరువు దాదాపు 140కిలోలు ఉన్నట్లు భావిస్తున్నామని తెలిసింది. 2011లో అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి ఏటా కిమ్‌ దాదాపు 6 నుంచి 7కిలోల బరువు పెరిగినట్లు అంచనా వేసింది.

ఇదిలాఉంటే, పొరుగు దేశాలైన చైనా, రష్యాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ.. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశం చెబుతోంది. కానీ, వైరస్‌ లక్షణాలున్న వందల మందిని క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి. అర‌కొర‌‌ ఆరోగ్య స‌దుపాయాలున్న‌ ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌కేసు న‌మోదు కాలేదని పేర్కొనడం పట్ల ప్రపంచదేశాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో ఉత్తర కొరియా తీవ్ర ఆహార కొరత, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని