Kim Slim: సన్నబడ్డ కిమ్‌.. వేదనలో ప్రజలు..!

ఉత్తర కొరియా అధినేత సన్నబడడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందోనన్న బెంగతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అక్కడి అధికారిక మీడియా పేర్కొంది.

Updated : 28 Jun 2021 16:57 IST

ధ్రువీకరించిన ఉత్తర కొరియా అధికారిక మీడియా

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సన్నబడిపోయినట్లు ఈమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అక్కడి అధికారిక మీడియా ధ్రువీకరించింది. అంతేకాకుండా అధినేత సన్నబడడంతో ఆయన ఆరోగ్యానికి ఏమైందోనన్న బెంగతో ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.

‘తమ అధినేత సన్నబడినట్లు ఉన్న వీడియోను చూసి మా హృదయాలు ఎంతగానో కలత చెందాయి. దేశంలో ప్రతిఒక్కరూ ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కిమ్‌ను చూసి కన్నీరు పెట్టుకుంటున్నామని చాలా మంది  చెప్పారు’ అని ఉత్తర కొరియా అధికారిక మీడియా KCTV పేర్కొంది.

బాహ్యప్రపంచానికి చాలా అరుదుగా కనిపించే కిమ్‌.. ఈ మధ్యే జరిగిన పార్టీ ప్లీనరీలో అధికారులతో సమావేశమయ్యారు. ప్లీనరీ ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ఓ సంగీత కార్యక్రమంలోనూ కిమ్‌ పాల్గొన్నారు. వాటికి సంబంధించిన వీడియోలను అక్కడి అధికారిక మీడియా ప్రసారం చేసింది. వాటిలో సన్నబడిపోయినట్లు కనిపించిన కిమ్‌ను చూసి దేశ ప్రజలు షాక్‌కు గురైనట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఐదు నెలల క్రితం బొద్దుగా ఉన్న కిమ్‌, ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్యంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అభిప్రాయపడింది.

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భారీగా బరువు తగ్గారనే విషయం అంతర్జాతీయంగానూ ఆసక్తిగా మారింది. కేవలం కొన్ని నెలల్లోనే ఒక్కసారిగా బరువు తగ్గడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు అనారోగ్యం  కారణమా? లేక కావాలనే బరువు తగ్గారా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని ఉత్తర కొరియా అధికారులు.. కిమ్‌ బరువు తగ్గారనే మాట వాస్తవమేనని ధ్రువీకరించారు. అయితే, అంతకుముందు కిమ్‌ బరువు 140కిలోలు ఉండవచ్చని దక్షిణకొరియా అధికారులు ఓ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం కిమ్‌ జోంగ్‌ ఉన్‌ భారీగా బరువు తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని