ఆన్‌లైన్‌ ఆటలతో ఒత్తిడి దూరం

లాక్‌డౌన్‌, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల వల్ల బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది అన్‌లైన్‌ గేమింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు.

Updated : 04 Jun 2021 04:43 IST

ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ అధ్యయనాల వెల్లడి

దిల్లీ:  లాక్‌డౌన్‌, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనల వల్ల బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చాలామంది అన్‌లైన్‌ గేమింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో ఆల్‌ ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్‌ చేపట్టిన అధ్యయనంలో ప్రజలు ఆన్‌లైన్‌ గేముల్ని డబ్బు సంపాదించడానికి, జీవన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఆడుతున్నారనే కొత్త విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 44 ఏళ్ల మధ్యన ఉండి, అన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే 2,400 మంది భారతీయులపై నిర్వహించిన అధ్యయనంలో 26 శాతం మంది ఒత్తిడి తగ్గించుకోవడానికి, 24 శాతం మంది డబ్బు సంపాదించడానికి, 13 శాతం మంది జీవన నైపుణ్యాలను, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆన్‌లైన్‌ గేములు ఆడుతున్నట్టు తేలింది. 

ఈ సందర్భంగా ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రోలాండ్ లాండర్స్ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఎదుగుదలకు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించడం, ఆపత్కాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం లాంటి విభిన్న నైపుణ్యాలు ఎంతో అవసరం. ఈ పరిశోధన ద్వారా వినియోగదారులు మొబైల్‌ గేమింగ్‌ విలువలను నిజంగా గ్రహిస్తారా లేదా అని అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నించాం. ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’’ అని అన్నారు.

ఆన్‌లైన్‌ ఆటలు ఆడేవాళ్లు ఓ ఆటను గెలవడానికి ఉత్తమ మార్గాన్ని కనిపెట్టడం ద్వారా విశ్లేషణాత్మక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని నమ్ముతున్నారు. ఆన్ లైన్ గేమింగ్ నైపుణ్యాలు నిజ జీవితంలో ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. వాటిని ఆడేవాళ్లు నిజ జీవిత సంబంధాలతో పోలిస్తే, ఆన్ లైన్ గేమింగ్ సహచరులతోనే మరింత అనుకూలమైన వైఖరిని ప్రదర్శిస్తారని పరిశోధకులు వెల్లడించారు. సహోద్యోగులతో కంటే గేమింగ్ సహచరులతోనే నిజాయతీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. వీళ్లలో 70 శాతం మందికి పైగా ఆన్‌లైన్‌ గేమ్స్‌ ద్వారా డబ్బులు సంపాదించడానికి మొబైల్‌ ఫోన్‌ ఎంచుకుంటున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ గేమ్స్‌ ద్వారా నెలకు 5 వేల నుంచి 45 వేల రూపాయల వరకు సంపాదించవచ్చనీ, ఒక గేమర్‌ లేదా టీమ్‌.. గేమింగ్ టోర్నమెంట్లలో 4.5 లక్షల వరకూ ప్రైజ్‌ మనీ పొందే అవకాశం ఉందని పరిశోధనలు పేర్కొన్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని