
Vaccination Drive: రాష్ట్రాలకు 100 కోట్ల డోసులు అందించాం: కేంద్రం
దిల్లీ: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 100 కోట్లకు పైగానే టీకా డోసులు అందించినట్లు కేంద్రం శుక్రవారం వెల్లడించింది. డైరెక్ట్ స్టేట్ ప్రొక్యూర్మెంట్ కేటగిరీ ద్వారా ఆ డోసులన్నింటినీ ఉచితంగానే అందించినట్లు తెలిపింది. ‘ఇప్పటివరకు 1,00,35,96,665 డోసులు అందించాం. ఇంకా 10.53 కోట్ల టీకా డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉన్నాయి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘దేశ జనాభాలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని మరింత పెంచనున్నాం. ఫైజర్‌తోపాటు మోడర్నా టీకా వినియోగానికి కూడా ఆమోదం తెలిపాం. త్వరలోనే టీకాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఈ మధ్యే ఆమోదం పొందిన జైడస్ టీకాతోపాటు దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లపై విదేశాలు ఆసక్తి చూపుతున్నట్లు మంత్రి తెలిపారు.
భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో 100 కోట్ల మైలురాయిని అందుకోనున్నాం. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్రం గతంలోనే వెల్లడించింది. ప్రభుత్వ వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 73 శాతం జనాభా కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారు. అందులో 30 శాతం రెండు డోసులు పూర్తిచేసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.