సైన్యంలో శాశ్వత కమిషన్‌..అది మహిళా వివక్షే!

శాశ్వత కమిషన్‌ ఏర్పాటుకు మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌) సమీక్షను ఆధారంగా చేసుకోవడం లోపభూయిష్టమని, వివక్షతో కూడిన విధానమని పేర్కొంది.

Published : 25 Mar 2021 16:28 IST

ఏసీఆర్‌ విధానాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

దిల్లీ: సైన్యంలో శాశ్వత కమిషన్‌ హోదాపై కొందరు మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శాశ్వత కమిషన్‌ ఏర్పాటుకు మహిళా అధికారుల వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌) సమీక్షను ఆధారంగా చేసుకోవడం లోపభూయిష్టమని, వివక్షతో కూడిన విధానమని పేర్కొంది. ఈ విధానం మహిళా అధికారులు సాధించిన ఘనతను, సైన్యానికి వారు తీసుకువచ్చిన కీర్తిని విస్మరించడమేనని వ్యాఖ్యానించింది.

సైన్యంలో 14ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ హోదా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2020 ఫిబ్రవరి 17న తీర్పువెలువరించింది. అయితే, సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాలు అమలు చేయడం లేదంటూ కొందరు మహిళా అధికారులు తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శాశ్వత కమిషన్‌లో చేర్చే విధానం ఏకపక్షం, అన్యాయంగా ఉందని ఆరోపిస్తూ పలు అంశాలను తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం, లింగ వివక్షకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో లేవనెత్తిన ఆందోళనలను కేంద్రం పరిష్కరించలేదని స్పష్టం చేసింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)నుంచి శాశ్వత కమిషన్‌ ఏర్పాటు కోసం ఏసీఆర్‌ విధానాన్ని అనుసరించడంలోనే ఒక క్రమబద్ధమైన వివక్ష కనిపిస్తోందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలని మహిళా అధికారులు కోరడం స్వచ్ఛంద సంస్థ మాదిరి కాదని, అది వారి హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని