Coal Shortage: బొగ్గు కొరతపై నేడు ప్రధాని సమీక్ష..!

దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం తలెత్తబోతోందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వల

Updated : 12 Oct 2021 14:38 IST

దిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం తలెత్తబోతోందంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వల పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం నేడు సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విద్యుత్‌, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బొగ్గు నిల్వలపై కీలక భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో నిన్న సమావేశమైన అమిత్ షా.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు, విద్యుత్‌ సరఫరా, డిమాండ్‌ వంటి అంశాలపై చర్చించారు.

దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయంటూ దేశ రాజధాని దిల్లీ సహా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం విద్యుత్ సంక్షోభం ఏర్పడబోదని, విద్యుత్ ఉత్పత్తికి సరిపడా వనరులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. బొగ్గు నిల్వలు నాలుగు రోజులకు కూడా సరిపోయేలా లేని విద్యుత్కేంద్రాల సంఖ్య 70కి పెరగడం మరింత కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని