Drones: ‘పెరిగిన నార్కో- టెర్రరిజం కార్యకలాపాలు.. 67 డ్రోన్లు గుర్తించాం’: బీఎస్‌ఎఫ్‌

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ వైపునుంచి కొన్నాళ్లుగా డ్రోన్ల కార్యకలాపాలు పెరిగిన విషయం తెలిసిందే! ఇదే క్రమంలో పాక్‌కు చెందిన నార్కో- టెర్రరిస్టుల ద్వారా డ్రోన్లతో డ్రగ్స్‌ సరఫరా ఘటనలూ ఈ ఏడాది పెద్దఎత్తున నమోదైనట్లు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్...

Published : 30 Nov 2021 23:52 IST

దిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ వైపునుంచి కొన్నాళ్లుగా డ్రోన్ల నిఘా కార్యకలాపాలు పెరిగిన విషయం తెలిసిందే! ఇదే క్రమంలో పాక్‌కు చెందిన నార్కో- టెర్రరిస్టుల ద్వారా డ్రోన్లతో డ్రగ్స్‌ సరఫరా ఘటనలూ ఈ ఏడాది పెద్దఎత్తున నమోదైనట్లు బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్ మంగళవారం తెలిపారు. పంజాబ్, జమ్మూ-కశ్మీర్‌ సరిహద్దుల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇటువంటివి 67 డ్రోన్లు కనిపించినట్లు వెల్లడించారు. ‘పంజాబ్, జమ్మూ సరిహద్దులకు సంబంధించినంతవరకు.. డ్రోన్ల కార్యకలాపాలు ఆందోళన కలిగించేవే. ఈ ఏడాది దాదాపు 67 సార్లు వీటిని గుర్తించాం. ఇవి ఆయుధాలు, మాదకద్రవ్యాలు.. ముఖ్యంగా హెరాయిన్‌తో ఇక్కడికి వస్తున్నాయి. రెండుసార్లు వాటిని కూల్చేశాం' అని డీజీ చెప్పారు.

యాంటీ డ్రోన్‌ పరికరాలు ఇన్‌స్టాల్‌..

నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో నార్కో-టెర్రరిజం కార్యకలాపాలు.. కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు చాలా కాలంగా తలనొప్పిగా మారాయి. వీటి కట్టడికి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ‘డ్రోన్ల కట్టడికి సరిహద్దుల్లో యాంటీ-డ్రోన్ పరికరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని ఉన్నాయి. ఇవి చాలా బాగా పని చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు చేస్తాం’ అని బీఎస్‌ఎఫ్ డీజీ తెలిపారు. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అధునాతన ‘హెరాయిన్’ డ్రోన్ల దిగుమతి తర్వాత భారత సైన్యం నిఘా సామర్థ్యాలు మరింత మెరుగుపడ్డాయి. తూర్పు లద్ధాఖ్‌ సెక్టార్‌లో నిఘా కార్యకలాపాల కోసం వాటిని మోహరిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని