Rahul Gandhi: మోదీ హయాంలోనే 23కోట్ల మంది పేదరికంలోకి..!

గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2022 02:26 IST

కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభం

దిల్లీ: గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయన్న ఆయన.. లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలారని అన్నారు. అయినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగంపై అసలు ఆ ఊసే లేదన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా తొలి ప్రసంగం చేసిన రాహుల్‌ గాంధీ.. మోదీ ప్రభుత్వం పేదవారి పొట్టకొట్టి ధనికులకు పంచిపెడుతోందని దుయ్యబట్టారు.

‘మోదీ ప్రభుత్వం పేదవారి పొట్టకొట్టి ధనికులకు పంచిపెడుతోంది. లక్షల మందికి ఉద్యోగాలు లేవు. యూపీఏ హయాంలో 27కోట్ల మంది పేదరికం నుంచి గట్టేక్కారు. కానీ మోదీ హయాంలో మాత్రం 23కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారు. కేవలం గతేడాదిలోనే 3కోట్ల ఉద్యోగాలు పోయాయి. కరోనా సమయంలో 84శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయి. కొవిడ్‌తో కుదేలైన చిన్న పరిశ్రమలకు మద్దతు లేదు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది’ అని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రమాదంలో భారత్‌ భద్రత..

‘భారత్‌ భద్రత తీవ్ర ప్రమాదంతో ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా చైనా,పాక్‌లు ఆయుధాలను పోగేసుకుంటున్నాయి. భారత్‌ను ఎదుర్కోవడంలో చైనాకు పక్కా ప్రణాళిక ఉంది. కానీ, మన విదేశీ విధానంలో తీవ్ర లోపం కనిపిస్తోంది. డోక్లాం, లద్దాఖ్‌ విషయంలో లోపాలు తేటతెల్లమయ్యాయి. సరిహద్దు లోపల, వెలుపల ఇదే పరిస్థితి నెలకొంది’ అని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.

ఇలా దేశంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రపతి మాత్రం తన ప్రసంగంలో నిరుద్యోగం వంటి కీలక విషయాలను ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు భారత్‌లు ఉన్నాయన్న ఆయన.. ఒకటి ధనికులది, మరొకటి పేదల భారత్‌ అంటూ అభివర్ణించారు. ఈ రెండింటి మధ్య అంతరం క్రమంగా పెరుగుతోందని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని