Vande Bharat: వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వే శాఖకు నష్టం ఎంతంటే?

vande Bharat Express: వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వే శాఖకు జరిగిన నష్టం వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభకు వెల్లడించారు.

Published : 26 Jul 2023 17:31 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్ల (Vande Bharat trains)పై దేశంలో పలుచోట్ల ఆకతాయిలు రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ.55.60లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటివరకు వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్వడంతో తమ శాఖకు జరిగిన ఆస్తి నష్టం వివరాలను బుధవారం ఆయన లోక్‌సభకు తెలిపారు. ఆయా ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 151మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అయితే, రాళ్లు రువ్విన ఘటనల్లో ఎవరూ చనిపోవడం గానీ, చోరీ, ప్రయాణీకులకు చెందిన వస్తువులు ధ్వంసం కావడం గానీ జరగలేదన్నారు.

Vande Bharat: మరింత మెరుగైన ఫీచర్లతో వందే భారత్‌ కోచ్‌లు!

2019 నుంచి 2023 జూన్‌ వరకు వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలతో రైల్వే శాఖకు రూ. 55.60 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడేందుకు ఆర్‌పీఎఫ్‌ అధికారులు జీపీఆర్‌/జిల్లా పోలీస్‌/అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనిచేస్తోందన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగితే ఉత్పన్నమయ్యే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రైళ్లపై విధ్వంసానికి అవకాశం ఉన్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్కార్టింగ్ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. కదిలే రైళ్లపై దాడి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామన్న ఆయన.. రెగ్యులర్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని