Vande Bharat: మరింత మెరుగైన ఫీచర్లతో వందే భారత్‌ కోచ్‌లు!

ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్‌ (Vande Bharat Express) కోచ్‌లలో కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరచనున్నట్లు ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ప్రకటించారు.

Published : 24 Jul 2023 14:15 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైళ్లు (Vande Bharat Trains) క్రమంగా అన్ని రాష్ట్రాల్లోనూ పట్టాలెక్కుతున్నాయి. భారతీయ రైల్వే (Indian Railways) నెట్‌వర్క్‌లో ఆధునిక తరం రైళ్లుగా ఇవి ఆవిర్భవించాయి. వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక ఫీచర్లను పరిచయం చేయడంతోపాటు, సాంకేతికంగా కూడా వీటిని ఉన్నతంగా రూపొదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25  వందే భారత్‌ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. 

ప్రస్తుతం నీలం రంగులో ఉన్న వందే భారత్‌ రైళ్లను నడుపుతున్నారు. త్వరలో కాషాయ రంగులో ఉన్న వందే భారత్‌ రైళ్లు కూడా రానున్నాయి. ఈ క్రమంలోనే వందే భారత్‌ కోచ్‌లలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ఫీచర్లను మరింత మెరుగుపరచనున్నారు. ఇటీవల చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్ ఫ్యాక్టరీ (ICF)ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) సందర్శించారు. ఈ సందర్భంగా వందే భారత్‌ రైళ్లలో కొన్ని మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. ఇంతకీ.. వందే భారత్‌లో కొత్తగా ఏమేం మారబోతున్నాయంటే..?

  • వందే భారత్‌ కోచ్‌లలో ప్రయాణికులు కూర్చునే సీట్ల కుషన్‌ గట్టిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త కోచ్‌లలో మెత్తటి కుషన్‌లను ఉపయోగించనున్నారు. అలాగే, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ సీట్ల రంగును రెడ్‌ నుంచి బ్లూకు మార్చడంతోపాటు, ఫుట్‌రెస్ట్‌ను మరింత పొడిగించనున్నారు. వీటితోపాటు సీట్ల వెనుక మ్యాగజైన్‌ బ్యాగ్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు.
  • ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు సీటు రిక్లైనింగ్‌ యాంగిల్‌ను పెంచనున్నారు. దీంతో ప్రయాణికులు తమ సీట్లను మరింత వెనక్కి జరపొచ్చు. దివ్యాంగుల వీల్‌ఛైర్‌ కోసం ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసి, అక్కడే వారికి సీటు కేటాయించనున్నారు. 
  • అత్యవసర సమయాల్లో ప్రయాణికులు లోకో పైలట్‌తో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో బోర్డర్‌లెస్‌ ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు సులువుగా అందుబాటులో ఉండేలా హ్యామర్‌ బాక్స్‌ కవర్‌లో మార్పులు చేయనున్నారు. కోచ్‌లో అగ్ని ప్రమాదాలను గుర్తించే ఏరోసోల్‌ ఫైర్‌ డిటెక్షన్‌ వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నారు.
  • ప్రయాణికులకు మెరుగైన ఎయిర్‌ కండిషనింగ్ కోసం ఎయిర్‌టైట్‌ ప్యానల్స్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అత్యవసర సమయాల్లో రైలును ఆపేందుకు ఉపయోగించే ఎమర్జెన్సీ పుష్‌ బటన్‌ను లోకో పైలట్‌కు సులువుగా యాక్సెస్‌ చేసేందుకు వీలుగా మార్పులు చేయనున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లో ఏం జరుగుతుందనేది తెలిసేందుకు వీలుగా.. అసెంబ్లీ యూనిట్ డోర్ ప్యానల్స్‌ను మరింత పారదర్శకంగా రూపొందించనున్నారు.
  • సీట్ల కింద ఉండే మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లను సులువుగా యాక్సెస్‌ చేసేలా వాటిలో మార్పులు చేయనున్నారు. ఇవే కాకుండా టాయిలెట్‌లో లైటింగ్‌ మెరుగుపరచడంతోపాటు, వాష్‌ బేషిన్‌ సైజ్‌లు పెంచడం, వాటర్‌ ట్యాప్‌లు, టాయిలెట్ హ్యాండిల్స్‌ వంటి వాటిలో కూడా మార్పులు చేస్తున్నారు.  
  • వందే భారత్‌ రైళ్లలో కోచ్‌ల మధ్య మెరుగైన కనెక్టివిటీ కోసం యాంటీ క్లైంబర్స్ అనే కొత్త భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యవస్థను వందే భారత్‌తోపాటు, అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. 

కార్గిల్‌ హీరోకు ఇండిగో అపూర్వ గౌరవం.. వీడియో వైరల్‌

ప్రస్తుతం వందే భారత్‌ రైళ్లలో ఏసీ ఛైర్‌కార్‌ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్‌ కోచ్‌లను పరిచయం చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 120 స్లీపర్‌ కోచ్‌ల తయారీ కోసం రష్యాకు చెందిన ట్రాన్స్‌ మాష్‌ హోల్డింగ్ (TMH)తో భారత్‌కు చెందిన రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RVNL) ఒప్పందం చేసుకుంది. మరో 80 స్లీపర్‌ కోచ్‌లను భెల్‌తో కలిసి టిటాగర్‌ వ్యాగన్స్ లిమిటెడ్‌ తయారుచేయనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు