India-China: చైనా-భారత్‌ రక్షణ మంత్రులు భేటీ.. తూర్పు లద్దాఖ్‌పై చర్చలు..?

భారత్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO Meet) సమావేశంలో పాల్గొనేందుకు చైనా రక్షణశాఖ మంత్రి లీ షాంగ్‌ఫు భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు.

Published : 27 Apr 2023 21:30 IST

దిల్లీ: భారత్‌(India), చైనా (China) సరిహద్దులో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇరు దేశాల సైనికాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు వచ్చిన చైనా రక్షణశాఖ మంత్రి జనరల్‌ లీ షాంగ్‌ఫుతో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) భేటీ అయ్యారు. తూర్పు లద్దాఖ్‌లోని (Eastern Ladakh) సరిహద్దు వివాదంపై వీరిద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. మూడేళ్ల క్రితం తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణ జరిగిన అనంతరం చైనా రక్షణమంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ (SCO Meet) సమావేశాలు భారత్‌లో జరుగుతున్నాయి. ఈ సదస్సులో భాగంగా రక్షణశాఖ మంత్రుల (Defence Ministers) సమావేశానికి హాజరయ్యేందుకు చైనా రక్షణమంత్రి లీ షాంగ్‌ఫు గురువారం దిల్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏవిధమైన చర్చలు జరిగాయనే విషయంపై అధికారక ప్రకటన రాలేదు. అయితే, తూర్పులద్దాఖ్‌పై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక చైనా రక్షణమంత్రితోపాటు ఇరాన్‌, తజకిస్థాన్‌, కజకిస్థాన్‌ దేశాల రక్షణ మంత్రులతోనూ రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. పాకిస్థాన్‌ రక్షణమంత్రి మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు.

భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య 18వ దఫా చర్చలు ఏప్రిల్‌ 23న జరిగాయి. తూర్పులద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనను పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించుకోవాలని రెండు దేశాల సైనిక ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు గోవాలో వచ్చేవారం జరిగే ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గాంగ్‌ కూడా భారత్‌ రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని