Agnipath: కేంద్రం మరో ఆఫర్‌.. అగ్నివీరులకు రక్షణశాఖలోనూ 10% రిజర్వేషన్‌

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. యువతకు దీనిపై మరింత నమ్మకం కలిగించేలా

Updated : 18 Jun 2022 17:09 IST

దిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. యువతకు దీనిపై మరింత నమ్మకం కలిగించేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందే అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రక్షణ శాఖ శనివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘‘తగిన అర్హత ఉన్న అగ్నివీరుల (Agniveers)కు రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఆమోదం తెలిపారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, డిఫెన్స్‌ సివిలియన్‌ పోస్ట్‌లతో పాటు 16 డిఫెన్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ విభాగాలకు ఈ రిజర్వేషన్‌ వర్తిస్తుంది. ప్రస్తుతమున్న ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాతో పాటు ఈ రిజర్వేషన్ అమలవుతుంది. ఇందుకోసం నియామక నిబంధనల్లో తగిన సవరణలు చేయనున్నాం. వయో పరిమితి సడలింపు కూడా చేయనున్నాం’’ అని రక్షణశాఖ వెల్లడించింది.

అగ్నిపథ్‌ (Agnipath)పై నిరసనలు పెల్లుబికిన నేపథ్యంలో ఈ ఉదయం రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ పథకంపై సమీక్ష చేపట్టారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులతో భేటీ అయ్యి చర్చించారు. ఈ సమావేశంలోనే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరుల (Agniveers)కు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది.

మా శాఖల్లోనూ నియమించుకుంటాం: హర్‌దీప్‌ సింగ్‌ పురి

అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి స్పందించారు. ఈ కొత్త విధానంపై ప్రతిపక్షాలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అగ్నిపథ్‌పై యువతకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ‘‘ఇదో గొప్ప పథకం. గృహ, చమురు మంత్రిత్వ శాఖ కింద అనేక ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ) ఉన్నాయి. అగ్నిపథ్‌ కింద సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులను పీఎస్‌యూల్లో నియమించుకునే అవకాశాలుంటే తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇప్పటికే మా మంత్రిత్వ శాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది’’ అని కేంద్రమంత్రి ఓ కార్యక్రమంలో తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని