Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌పై మళ్లీ దద్దరిల్లిన రాజ్యసభ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో బుధవారం కూడా అదే గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు విపక్షాలు పట్టుబట్టడంతో

Published : 08 Dec 2021 11:40 IST

దిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో బుధవారం కూడా అదే గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేతకు విపక్షాలు పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 

ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు శూన్య గంట చేపట్టారు. అయితే ఎంపీల సస్పెన్షన్‌ సహా పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు నోటీసులిచ్చారు. ఇందుకు ఛైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే ఛైర్మన్‌ సభను కొనసాగించారు. అయినప్పటికీ వారు నినాదాలు చేస్తూ.. వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని వెంకయ్యనాయుడు పలుమార్లు వారించినా.. ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఒకింత అసహనానికి గురైన ఛైర్మన్‌.. సభ్యులు ఇలా ప్రవర్తించకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద సస్పెన్షన్‌ వేటు వేసింది. సస్పెండ్‌ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని