Wrestlers Protest: రైల్వే విధుల్లోకి టాప్‌ రెజ్లర్లు.. ఆందోళన కొనసాగుతుంది

రెజర్ల ఆందోళన నేడు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. టాప్‌ రెజ్లర్లు రైల్వేలోని తమ విధులకు హాజరయ్యారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ వర్గాలు ధ్రువీకరించాయి.  

Updated : 05 Jun 2023 15:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని వారాలుగా దిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌  రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. రెజ్లర్ల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రెండురోజుల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం. సాక్షి భర్త సత్యవర్త్‌ కడియన్‌ ఇటీవల మాట్లాడుతూ తమకు హోంశాఖ మంత్రి నుంచి ఆశించిన ప్రతిస్పందన రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ఈ టాప్‌ రెజర్లు మే 31నే విధుల్లో చేరినట్లు రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తమ ఆందోళనలను కొనసాగిస్తామని సాక్షి పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి దేశంలోని టాప్‌ రెజ్లర్లయిన బజరంగ్‌ పునియా, సాక్షిమాలిక్‌, వినేష్‌ ఫొగాట్‌ నేతృత్వంలో రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తమతో ఆయన దారుణంగా ప్రవర్తించేవారని, శరీరాన్ని తాకడం, అనుమతి లేకుండా దుస్తుల్లో చేతులు పెట్టడం.. కౌగిలించుకోవడం.. తదితర అసభ్య కార్యకలాపాలకు పాల్పడేవారని మహిళా రెజ్లర్లు ఇప్పటికే ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్‌, మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ ఏప్రిల్‌ 28న దాఖలైంది. ఇందులో పోక్సో చట్టం సెక్షన్‌ కూడా ఉంది. ఈ కేసు నిరూపితమైతే బ్రిజ్‌ భూషణ్‌కు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

మరోవైపు రెజ్లర్లు ఆందోళన విరమించారని జరుగుతున్న  ప్రచారంపై రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేము వెనక్కి తగ్గలేదు. సత్యాగ్రహంతో పాటే రైల్వేలో నా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు’’ అని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని