Lakhimpur Violence: సిట్‌ చెప్పినా.. ఆశిష్‌ బెయిల్‌ రద్దుకు ఎందుకు ప్రయత్నించలేదు..?

సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ (Lakhimpur Kheri) హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా (Ashish Mishra) బెయిల్‌కు వ్యతిరేకంగా దాఖలైన

Published : 30 Mar 2022 13:59 IST

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అసహనం

దిల్లీ: సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ (Lakhimpur Kheri) హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా (Ashish Mishra) బెయిల్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ప్రతిపాదించినా.. ఆశిష్‌ బెయిల్‌ రద్దుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

‘‘ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో అప్పీల్‌ దాఖలు చేయాలని కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తోన్న న్యాయమూర్తి ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలతో కూడిన నివేదికతో సిట్‌.. యూపీ అదనపు చీఫ్‌ సెక్రటరీ(హోం)కి రెండు లేఖలు పంపింది. మరి ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌ చేయలేదు..?’’ అని యూపీ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పందిస్తూ.. అదనపు చీఫ్‌ సెక్రటరీకి ఎలాంటి లేఖలు అందలేదని తెలిపారు. 

దీంతో అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. సిట్‌ నివేదిక కాపీలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ నివేదికపై యూపీ సర్కారు ఏప్రిల్‌ 4 లోగా తమ సమాధానం తెలియజేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 

గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా (Ajay Mishra) కుమారుడు ఆశిష్‌ మిశ్రా కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. 

అయితే గత నెలలో ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేయడంతో యూపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆశిష్‌ మిశ్రాకు బెయిల్‌ ఇవ్వడాన్ని అలహాబాద్‌ హైకోర్టులో గట్టిగా వ్యతిరేకించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే బెయిల్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ సంబంధిత అధికారుల వద్ద పెండింగ్‌లో ఉందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని