Supreme court: ఇక సీల్డ్ కవర్లు ఆపేద్దాం: ఓఆర్‌ఓపీ కేసులో ఘాటుగా స్పందించిన సుప్రీం

అర్హులైన మాజీ సైనికులకు ఓఆర్‌ఓపీ(OROP) బకాయిల చెల్లింపుపై సోమవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే సీల్డ్ కవర్ సంప్రదాయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Updated : 20 Mar 2023 16:08 IST

దిల్లీ: అర్హులైన మాజీ సైనికులకు వన్‌ ర్యాంకు-వన్‌ పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) బకాయిల గురించిన అభిప్రాయాలను సీల్డ్‌ కవర్‌ (Sealed Cover)లో సమర్పించడంపై సోమవారం సుప్రీంకోర్టు(supreme court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. 

‘మేం ఎటువంటి రహస్య పత్రాలు, సీల్డ్ కవర్లు (Sealed Covers) తీసుకోం. వ్యక్తిగతంగా నేను వాటికి వ్యతిరేకిని. న్యాయస్థానాల్లో పారదర్శకత ఉండాలి. ఈ కేసులో రహస్యం ఏముంది. మేమిచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నారు అంతేకదా. నేను ఈ సీల్డ్ కవర్ సంప్రదాయానికి ముగింపు పలుకుదామనుకుంటున్నాను. దీనిని సుప్రీంకోర్టు అనుసరిస్తే.. హైకోర్టులు అదే బాటలో పయనిస్తాయి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. అటార్నీ జనరల్‌తో వ్యాఖ్యానించారు. ఎవరి జీవితానికైనా ప్రమాదం కలుగుతుందంటే, విశ్వసనీయ సమాచార మూలాల గురించి చెప్పేప్పుడు ఈ పద్ధతిని అనుసరించవచ్చని సూచించారు. 

ఈ కేసుపై స్పందిస్తూ.. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ ఇబ్బందిని కోర్టు గమనిస్తోందని, అయితే వీటి చెల్లింపు ప్రణాళికను వివరించాలని కోరారు. ‘బడ్జెట్ ప్రణాళిక ప్రకారం.. ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదు. వనరులు పరిమితంగా ఉన్నాయి. ఖర్చును నియంత్రించాల్సి ఉంది’ అంటూ అటార్నీ జనరల్‌ వివరించారు.

ఓఆర్‌ఓపీ (OROP) బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ జనవరిలో ఇచ్చిన సమాచారాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఈ నెలలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు  ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది? చెల్లింపుల్లో ప్రాధాన్య అంశాలు? ఎలాంటి విధివిధానాలను అనుసరించాలనే అంశాలపై ఈ నెల 20 లోగా నివేదిక ఇవ్వండి’ అని ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ రోజు వివరాలను సమర్పించింది. అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది. ‘ఏప్రిల్‌ 30 లోగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, అవార్డులు గెలుచుకున్నవారికి  ఒకే ఇన్‌స్టాల్‌మెంట్‌లో బకాయిలు చెల్లించాలి. జూన్‌ 30 నాటికి 70 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు, అలాగే మిగతా అర్హులైన పెన్షనర్లకు మూడు వాయిదాల్లో ఫిబ్రవరి 28, 2024 నాటికి ఆ మొత్తాన్ని చెల్లించాలి’ అని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని