SC On Divorce: ‘విడాకుల’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

‘‘దంపతుల మధ్య వివాహ బంధం (Marriage) కోలుకోలేని విధంగా విచ్ఛినమైతే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి తక్షణమే విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే’’ - సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు

Updated : 01 May 2023 14:58 IST

దిల్లీ: విడాకుల (Divorce) మంజూరు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది.

‘‘దంపతుల మధ్య వివాహ బంధం (Marriage) కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు (Supreme Court) వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. అందు కోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు’’ అని జస్టిస్‌ ఎస్‌.కే. కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

కుటుంబ న్యాయస్థానాలకు (Family Court) రిఫర్‌ చేయకుండానే సుప్రీంకోర్టు నేరుగా విడాకులు మంజూరు చేసే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే  దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. 2016 జూన్‌ 29న ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. కొన్నేళ్ల పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. గతేడాది సెప్టెంబరులో తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని