Agnipath: ‘అందుకోసమేనా నాలుగేళ్ల సర్వీసు?’.. కేంద్రాన్ని ప్రశ్నించిన శత్రుఘ్న సిన్హా

‘అగ్నిపథ్’ పథకం ద్వారా సమర్థవంతమైన వారిని నియమిస్తే కేవలం నాలుగేళ్ల తర్వాత వారిని ఎలా రిటైర్‌ చేస్తారని

Published : 21 Jun 2022 01:49 IST

దిల్లీ: ‘అగ్నిపథ్’ (Agnipath) పథకం ద్వారా సమర్థమైన వారిని నియమిస్తే కేవలం నాలుగేళ్ల తర్వాత వారిని ఎలా రిటైర్‌ చేస్తారని తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పథకం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అశావాహులు నిరసనలు చేస్తున్నారని.. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి సిన్హా పలు ప్రశ్నలు సంధించారు.

‘అగ్నివీరులను నాలుగేళ్ల తర్వాత తొలగించి భాజపా కార్యాలయాల ముందు సెక్యూరిటీ గార్డ్స్‌లా నియమించుకుంటారా? అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ ఆర్మీలోని మాజీ సైనికాధికారులు మాట్లాడటం నేనూ చూశాను. సైన్యంలో ప‌నిచేస్తున్న జ‌వాన్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 58 ఏళ్లు ఉండాలని దివంగత సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ గతంలోనే అన్నారు. ఇప్పుడేమో వేరే ట్యూన్‌. వేరే టోన్‌. ఎందుకిలా? వాళ్లు మన దేశంలోనే నివసించే వారే కదా. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్లనే కాదు వారి కుటుంబాలను కూడా’ అని సిన్హా అన్నారు. 

సాయుధ దళాల సిబ్బంది, అధికారుల స్థాయి కంటే తక్కువ ఉన్న వారి పదవీ విరమణ వయసు 37-38 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు పొడిగించాలని దివంగత సీడీఎస్‌ బిపిన్ రావత్‌ చెప్పిన మాటలను సిన్హా ఉటంకించారు. జ‌వాన్లు కేవ‌లం 15 లేదా 17 ఏళ్లే స‌ర్వీస్‌లో ఎందుకుండాలని, వారు 30 ఏళ్లు ఎందుకు సేవ చేయ‌కూడ‌ద‌ని బిపిన్‌ రావత్‌ అభిప్రాయపడ్డారని చెప్పారు. శిక్షణ పొందిన సైనికులు తొంద‌ర‌గా రిటైర్‌ అవ్వకూడదని ఆయన వ్యాఖ్యానించారని సిన్హా గుర్తుచేశారు.

సైనికుల పెన్షన్‌ వ్యయాన్ని పాక్షికంగా తగ్గించడానికే షార్ట్ టర్మ్‌ రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ (అగ్నిపథ్‌)ను తీసుకొచ్చారని సిన్హా విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత 25 శాతం మందినే శాశ్వత నియామకాల్లో తీసుకుంటామనడంపైనా మండిపడ్డారు. ‘‘ఈ 25 శాతం మంది ఎవరు? వాళ్లు మీ సొంత మనుషులా? మీరు ఇష్టపడే బంధువులా’’ అని సిన్హా ప్రశ్నించారు. నాలుగేళ్ల సర్వీస్‌పైనా ప్రశ్నిస్తూ.. ‘‘నాలుగేళ్ల సర్వీసే ఎందుకు? ఐదేళ్లు ఎందుకు కాకూడదు? దీనివల్ల కొంత గ్రాట్యుటీని ఆదా చేయడం కోసమేనా?’’ అని కేంద్రాన్ని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని