Vaccine: ఒక్క టీకాతో కరోనా వైరస్‌లు ఖతం!

రకరకాల ఉత్పరివర్తనాలతో ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌నే కాదు దాని కుటుంబానికి చెందిన వైరస్‌లు ఎన్ని కొత్తగా పుట్టుకొచ్చినా రక్షణ కల్పించే బ్రహ్మాస్త్రం వంటి టీకా ఒకటి

Updated : 24 Jun 2021 09:29 IST

వాషింగ్టన్‌: రకరకాల ఉత్పరివర్తనాలతో ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా వైరస్‌నే కాదు దాని కుటుంబానికి చెందిన వైరస్‌లు ఎన్ని కొత్తగా పుట్టుకొచ్చినా రక్షణ కల్పించే బ్రహ్మాస్త్రం వంటి టీకా ఒకటి సిద్ధమవుతోంది. భవిష్యత్తులో కరోనా వైరస్‌లు ఏ రూపంలో విరుచుకుపడినా సమర్థంగా అడ్డుకొనే సార్వత్రిక టీకా(యూనివర్సల్‌ వ్యాక్సిన్‌)ను అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా శాస్త్రవేత్తలు అభివృద్ధిపరుస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయన వివరాలు ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా కుటుంబం నుంచి ఏ రకం వైరస్‌ వచ్చినా సమర్థంగా అడ్డుకొనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు...ఎంఆర్‌ఎన్‌ఏ కోడ్‌పై దృష్టి సారించారు. ఫైజర్‌, మోడెర్నా కంపెనీలు ఇప్పుటికే ఒక వైరస్‌ ఎంఆర్‌ఎన్‌ఏ కోడ్‌ ఆధారిత టీకాలను అభివృద్ధి చేశాయి. ఇదే నమూనాను అనుకరించి పలు రకాల కరోనా వైరస్‌ల ఎంఆర్‌ఎన్‌ఏ కోడ్‌లను జత చేసి హైబ్రిడ్‌ టీకాను రూపొందించారు. ఈ హైబ్రిడ్‌ టీకాను ఎలుకలకు ఇవ్వగా విభిన్న రకాల స్పైక్‌ ప్రొటీన్లను నిర్వీర్యపరిచే ప్రతిరక్షకాలు(యాంటీబాడీస్‌) వాటి శరీరాల్లో ఉత్పత్తి అయ్యాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన రాల్ఫ్‌ బారిక్‌ తెలిపారు. ఈ టీకా ఎలుకల్లో ప్రవేశపెట్టిన కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా అడ్డుకోవడమే కాకుండా ఊపిరితిత్తులకూ రక్షణ కల్పించిందని వివరించారు. మరింత అధ్యయనం తర్వాత వచ్చే ఏడాది మనుషులపై ప్రయోగాలకు సిద్ధమవుతామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని