Modi: పెట్రోల్‌పై ఆ రాష్ట్రాలు పన్ను తగ్గించట్లేదు.. ఇంధన ధరలపై తొలిసారి స్పందించిన మోదీ

దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ

Published : 27 Apr 2022 14:44 IST

దిల్లీ: దేశంలో పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులపై వెనక్కి తగ్గట్లేదని దుయ్యబట్టారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో ఇకనైనా ఆయా రాష్ట్రాలు ఇంధన ధరలపై పన్నులను తగ్గించాలని కోరారు.

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంధన ధరల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘గతేడాది నవంబరులో ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలని కోరాం. కానీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఝార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాలు మా మాట వినలేదు. కారణమేదైనా పన్నులు తగ్గించలేదు. నేను ఎవర్నీ విమర్శించట్లేదు. కానీ, ఇకనైనా ఆయా రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో  ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని కోరుతున్నా’’ అని మోదీ తెలిపారు.

‘నాలుగో వేవ్‌’ భయాలపై మోదీ సూచనలు..

సమావేశంలో భాగంగా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించారు. గత రెండు వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మనమంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేలా మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం వంటి నిబంధనలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. టెస్ట్‌, ట్రాకింగ్‌, ట్రీట్మెంట్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా రాష్ట్రాలు అప్రమత్తం కావాలని ప్రధాని తెలిపారు. మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచాలన్నారు. ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌..

ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశంలో 96 శాతం మంది వయోజనులకు కనీసం ఒక డోసు అందడం.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అర్హులైన ప్రతి చిన్నారికి వ్యాక్సినేషన్‌ అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. మార్చి నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. 6-12 ఏళ్ల వయసు చిన్నారులకు కూడా వ్యాక్సిన్‌ ఇచ్చేలా రెండు టీకాలకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. పిల్లలకు టీకా పంపిణీపై తల్లిదండ్రులకు, చిన్నారులకు అవగాహన కల్పించాలని ప్రధాని రాష్ట్రాలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని