రష్యా వ్యక్తికి తెలిసింది.. కేంద్రానికి తెలియదా..?

భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Published : 05 Jun 2021 01:31 IST

వ్యాక్సిన్‌ కొరతపై దిల్లీ హైకోర్టు ఆవేదన

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో దేశంలో వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా ఏర్పడడం పట్ల దిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో అందరకీ వ్యాక్సిన్‌ అందించడం ఒక్కటే ఉత్తమ మార్గమని చెబుతున్నప్పటికీ.. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత్‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల గురించి రష్యాలో ఉన్న వ్యక్తికి తెలిసిన విషయం కేంద్రానికి తెలియదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుత్నిక్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పనేషియా బయోటెక్‌కు సంబంధించిన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

‘సెకండ్‌ వేవ్‌ సమయంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. బాధ్యతగల పౌరుడిగా మీకు కూడా అదే ఆవేదన ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్‌ కొరత ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ఈరోజు కూడా దిల్లీలో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. దేశంలో ఎన్నో మంచి ఉత్పత్తులు ఉన్నాయి. వాటికి చిన్నపాటి చేయూత ఇస్తే చాలు’ అని పనేషియా పిటిషన్‌ విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టు బెంచ్‌ పేర్కొంది. అంతేకాకుండా ‘ఎక్కడో రష్యాలో ఉన్న ఓ వ్యక్తి హిమాచల్‌లో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థను గుర్తించగలిగారు. కానీ, అలా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యింది’ అని స్పష్టంచేసింది. దేశంలో వనరులున్నప్పటికీ వ్యాక్సిన్‌ తయారీలో వాటిని కేంద్ర ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

ఇన్‌ఫ్లూయోంజా వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి 2010లో ఓ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై పనేషియా బయోటెక్‌ హైకోర్టును ఆశ్రయించింది. 2019లో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయాలని కోరింది. దీంతో విచారణ చేపట్టిన దిల్లీ హై కోర్టు.. పనేషియా బయోటెక్‌కు రూ.14కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా 2012 నుంచి ఇప్పటివరకు ఏడాదికి 12శాతం వడ్డీని కలిపి చెల్లించాలని పేర్కొంది. తాజాగా ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని