మమత పిటిషన్‌ విచారణకు సుప్రీం జడ్జి నో!

పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుధా బోస్‌ తప్పుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఆయన

Published : 22 Jun 2021 13:34 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌ తప్పుకున్నారు. కోల్‌కతాకు చెందిన ఆయన ‘ఈ కేసులో వాదనలు వినాలనుకోవడం లేదు’ అని ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన మరో కేసు విచారణ నుంచి సైతం జస్టిస్‌ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకున్నారు. ఈమె కూడా కోల్‌కతాకు చెందినవారే. ఇలా బెంగాల్‌కు సంబంధించిన కేసుల నుంచి న్యాయమూర్తులు వరుసగా తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2014లో పశ్చిమబెంగాల్‌లో నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఇటీవల అదుపులోకి తీసుకుంది. అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వీరి అరెస్టును నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయంలో ఒక రోజంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను బెంగాల్‌ వెలుపలకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడిలో కేసు విచారణ సజావుగా సాగించలేమని వాదించింది.

సీబీఐ అభ్యర్థనను తప్పుబట్టిన ముఖ్యమంత్రి.. కేసును బెంగాల్‌ వెలుపలకు తరలించొద్దని హైకోర్టును కోరారు. ఈ మేరకు తమ వాదనను వినిపించేందుకు వీలుగా ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో దీదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని