India-China: సరిహద్దు వివాదం.. రేపు భారత్‌, చైనా మధ్య 13వ విడత చర్చలు..!

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మరోసారి సమావేశం కానున్నాయి.

Published : 09 Oct 2021 18:05 IST

దిల్లీ: సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం 13వ విడత ఉన్నత స్థాయి సైనిక కమాండర్ల చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్మీ వర్గాలు నేడు వెల్లడించాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద రేపు ఉదయం 10.30 గంటలకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశం కానున్నట్లు సమాచారం. తూర్పు లద్దాఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌, గోగ్రా తదితర ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ దఫా చర్చల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. 

తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలు భారీగా సైన్యాలను మోహరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటికే 12 సార్లు సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది జులైలో ఉభయ దేశాల సైనిక కమాండర్లు భేటీ అయ్యారు. ఈ చర్చలకు అనుగుణంగా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. అయితే ఘర్షణకు కేంద్ర బిందువులుగా ఉన్న మిగతా ప్రాంతాల్లో సైనిక మోహరింపు కొనసాగుతోంది. రేపటి చర్చల్లో హాట్‌స్ప్రింగ్స్‌తో పాటు గోగ్రా లోయ, దెమ్‌చోక్‌ల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా.. సరిహద్దు వివాద పరిష్కారంపై భారత్‌, చైనా భేటీ కానున్న సమయంలో డ్రాగన్‌ ఇటీవల మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. గతవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో చొరబాటుకు యత్నించింది. అయితే భారత బలగాలు అప్రమత్తమై వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరు దేశాల బలగాల మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని