Aashna Lidder: ‘పరిపూర్ణ దేశం కోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..!’

ఒక పరిపూర్ణ దేశంకోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..ఈ వాక్యం దేశం కోసం అలవోకగా ప్రాణాలు అర్పించే సైనికుడి కుటుంబాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి.

Updated : 11 Dec 2021 17:06 IST

ఆష్నా కొద్ది రోజుల కిందట చెప్పిన మాటలు..తనకే ఎదురయ్యాయి

దిల్లీ: ఒక పరిపూర్ణ దేశంకోసం.. అసంపూర్ణంగా మిగిలే కుటుంబాలు..ఈ వాక్యం దేశం కోసం అలవోకగా ప్రాణాలు అర్పించే సైనికుడి కుటుంబాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. పైగా ఈ మాటలు అన్నది ఆష్నా లిద్దర్‌. ఇటీవల తమిళనాడు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ కుమార్తె ఆమె. ఆమె రాసిన ‘సెల్ఫ్‌లెస్ ఇండిపెండెన్స్’ అనే కవితలోనివి ఆ మాటలు. వీర సైనికుల త్యాగాలను వర్ణిస్తూ ఆమె రాసిన ఆ వాక్యం.. ఇప్పుడు ఆమె కుటుంబం విషయంలోనే వాస్తవరూపం దాల్చడం అత్యంత విషాదకరం. డిసెంబర్ 3న బుక్ రీడింగ్ సెషన్‌లో భాగంగా ఆమె చెప్పిన కవితను భారత దేశ మొదటి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 

‘బుక్ రీడింగ్‌ సెషన్‌లో భాగంగా డిసెంబర్ 3న ఆష్నా లిద్దర్ తన పుస్తకం నుంచి ఈ కవితను చదివి వినిపించింది. ఆ మాటలు వింటుంటే ఏదో చెడుగా అనిపించింది. జీవితం ఎప్పుడూ చిక్కుముడే’ అంటూ కిరణ్ బేడీ బుక్ రీడింగ్‌ సెషన్ వీడియోను షేర్ చేశారు. తాము చేసిన త్యాగానికి తగిన కృతజ్ఞత లభిస్తుందని కచ్చితంగా తెలీకపోయినా.. ప్రజల కోసం ప్రాణాలు విడిచే సైనికులను ఉద్దేశించి ఈ కవిత రాసినట్లు ఆ సందర్భంలో ఆష్నా వెల్లడించింది. అతడి మృతితో నిర్భయంగా మారిన బిడ్డ గురించి, ఒంటరిగా మిగిలిన భార్య గురించి వివరిస్తుంది. 

ఇదిలా ఉండగా.. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌ బిపిన్ రావత్‌ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ కూడా మరణించారు. నిన్న అంతిమ సంస్కారాల సమయంలో లిద్దర్ సతీమణి గీతిక, కుమార్తెల వేదన ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టించింది. ఆయనకు అంతా నవ్వుతూ వీడ్కోలు పలుకుదామని గీతిక పలికిన మాటలు ప్రతిఒక్కరినీ ఉద్వేగానికి గురిచేశాయి. 

శుక్రవారం లిద్దర్‌ అంత్యక్రియలు ముగియగా, అంతకంటే ముందు లిద్దర్ శవపేటికను ఆత్మీయంగా చుంబించి.. ఆయన సతీమణి గీతిక వీడ్కోలు పలికారు. పక్కనే ఉన్న కుమార్తె కూడా తన తండ్రి ఇక రారనే ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘నాకు 17 సంవత్సరాలు. అంటే నాకు, మా నాన్నకు మధ్య 17 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన మాకు మిగిల్చిన అందమైన జ్ఞాపకాలతో మేం ముందుకు వెళ్తాం. ఆయన దూరమవడం.. దేశానికి పూడ్చలేని నష్టం. బహుశా ఇదే విధి అనుకుంటా. నా తండ్రే నాకు హీరో, నా బెస్ట్‌ ఫ్రెండ్, నా మోటివేటర్’ అంటూ ఆయన కుమార్తె ధైర్యంగా మాట్లాడింది. ‘మేం ఆయనకు గొప్పగా వీడ్కోలు పలకాలి. కన్నీటితో కాకుండా నవ్వుతూ, ప్రశాంతంగా సాగనంపాలి. నేనొక సైనికుడి భార్యను. ఇది పూడ్చలేని నష్టం’ అంటూ లిద్దర్ సతీమణి గీతిక స్పందించారు. తుది వీడ్కోలు సమయంలో వారిద్దరూ గుండె దిటవు చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని