Dera Baba: అనుచరుడి హత్యకేసులో డేరా బాబా దోషి!

డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను ఓ హత్య కేసులో సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది.

Updated : 08 Oct 2021 18:37 IST

తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

చండీగఢ్‌: డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను ఓ హత్య కేసులో సీబీఐ న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2002లో హత్యకు గురైన డేరా సౌదాకు మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ కేసులో డేరా బాబా పాత్ర ఉన్నట్లు పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. ఆయనతో పాటు మరో నలుగురికి ఈ హత్య కేసులో హస్తం ఉన్నట్లు తేల్చిన న్యాయస్థానం.. అక్టోబర్‌ 12న శిక్ష ఖరారు చేయనుంది. అయితే, ఇందులో ఓ వ్యక్తి గతేడాది ప్రాణాలు కోల్పోయారు. డేరా బాబా మాత్రం ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు.

డేరా బాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్‌ సింగ్‌ 2002లో హత్యకు గురయ్యారు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌గా ఉన్న రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ ఛార్జిషీటులో నమోదు చేసింది. ఆ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్లు పేర్కొంది. వారందరినీ దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్‌ 12న శిక్ష ఖరారు చేయనుంది. అయితే, ఇదే హత్య కేసు విచారణను పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి పంజాబ్‌, హరియాణాలోని ఏదైనా ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని డేరా బాబా అక్కడి హైకోర్టును ఈ మధ్యే ఆశ్రయించారు. కానీ, ఆయన అభ్యర్థనను పంజాబ్‌, హరియాణా కోర్టు తోసిపుచ్చింది.

ఇదిలాఉంటే, సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్‌ ఆ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను వంధ్యులుగా మార్చారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. పలువురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేసేవారని చెబుతుంటారు. ఇలా వివాదాస్పద గురువుగా ఉన్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో జైలుకు వెళ్లారు. ఆ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఆయన రోహ్‌తక్‌లోని సునారియాలో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని