Updated : 13 Oct 2021 15:36 IST

లఖింపుర్ ఘటనను ఖండించాల్సిందే.. మరి మిగిలిన వాటి సంగతేంటి..?

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య

యూఎస్ పర్యటనలో ఎదురైన ప్రశ్నలకు సమాధానం

బోస్టన్‌: అమెరికా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లఖింపుర్ ఖేరి హింసాకాండపై స్పందించారు. అది పూర్తిగా ఖండించదగినదని చెప్పారు. భారత్‌ గురించి తెలిసిన ప్రతిఒక్కరు ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకునే ఈ తరహా ఘటనల్ని కూడా లేవనెత్తాల్సి ఉందన్నారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్‌లో జరిగిన చర్చలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆమెకు సమాధానమిచ్చారు. 

లఖింపుర్ ఘటనపై..

లఖింపుర్ ఘటనపై ప్రధాని, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు స్పందించలేదంటూ నిర్మలా సీతారామన్‌కు ప్రశ్న ఎదురైంది. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుండగా ఎందుకు రక్షణాత్మకంగా స్పందిస్తున్నారనగా...‘ కచ్చితంగా అలాంటిది ఏమీలేదు. ఆ ఘటన పూర్తిగా ఖండించదగింది. ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనల గురించే నా ఆందోళన. భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలున్నాయి. అమర్త్యసేన్ సహా భారత్‌ గురించి తెలిసిన వ్యక్తులు ఆ ఘటనల్ని లేవనెత్తాలని కోరుకుంటున్నాను.  ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలో ఉంది కాబట్టే ఈ మాట చెప్తున్నాను. ఈ ఘటనకు పాల్పడింది ఎవరైనా.. దర్యాప్తు ద్వారా న్యాయం జరుగుతుంది’ అని సమాధానమిచ్చారు. ‘ఇది నా పార్టీ, ప్రధాని గురించి రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించడం కాదు. నేను నా దేశం గురించే మాట్లాడతాను. పేదలకు దక్కాల్సిన న్యాయం కోసం మాట్లాడతాను. ఇదే నేను మీకిచ్చే సమాధానం’ అంటూ నిర్మల బదులిచ్చారు. 

సాగు చట్టాలపై నిరసన గురించి..

ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలపై పలు పార్లమెంటరీ కమిటీలు ఒక దశాబ్దం పాటు చర్చించాయని నిర్మల వెల్లడించారు. 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు వాటిని పరిశీలించాయన్నారు. ‘ఆ బిల్లులు లోక్‌సభకు వచ్చినప్పుడు విస్తృత చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి కూడా వీటిపై మాట్లాడారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వచ్చాకే వాటిపై గందరగోళం మొదలైంది. వీటిపై నిరసన తెలుపుతున్న రైతులు ఒక్క రాష్ట్రం వారే. పంజాబ్ రాష్ట్రంతో పాటు హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందినవారే. నిరసనకారులతో ఆ చట్టాలపై చర్చించడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. మూడు చట్టాల్లో ఉన్న ఒక్క అభ్యంతరమైనా చెప్పాలన్నాం. వారు ఇంతవరకు అదేంటో స్పష్టత ఇవ్వలేదు’ అంటూ ఆమె వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ ఏడు సంవత్సరాల్లో ప్రకటించిన కనీస మద్దతు ధర కింద అత్యధిక మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులను సేకరించామని చెప్పారు. ఎటువంటి ఆలస్యం లేకుండా మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. 

గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై పంజాబ్, హరియాణా రాష్ట్రాలతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొద్దినెలలుగా దిల్లీ శివారు ప్రాంతంలో ఆందోళన సాగిస్తున్నారు. దీనిపై కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఈ క్రమంలో యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి కేంద్రమంత్రి తనయుడికి చెందిన వాహన శ్రేణి దూసుకెళ్లింది. ఆ తర్వాత అక్కడ జరిగిన ఘటనల్లో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. 

బొగ్గు కొరతపై..

భారత్‌లో బొగ్గు కొరత గురించి వెలువడుతున్న నివేదికలను ఈ సందర్భంగా సీతారామన్ తోసిపుచ్చారు. దేశంలో ఎలాంటి కొరత లేదని, ఆ వార్తలన్నీ నిరాధారమైనవన్నారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు రోజులకు సరిపడా  నిల్వలున్నాయని మంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సరఫరాలో కొరతకు దారితీసే లోపాలు లేవని, భారత్ విద్యుత్ మిగులు దేశంగా నిలిచిందని వెల్లడించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని