Sputnik Light: స్పుత్నిక్‌ లైట్‌.. సింగిల్‌ డోసు టీకా ఎగుమతికి భారత్‌ అనుమతి

రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-లైట్‌’ భారత్‌లో తయారవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 10 Oct 2021 23:15 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ ‘స్పుత్నిక్‌-లైట్‌’ భారత్‌లో తయారవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్‌ రెండు డోసుల్లో టీకా వినియోగానికి భారత్‌లో అనుమతి ఉన్నప్పటికీ.. సింగిల్‌ డోసు వినియోగానికి వినియోగంలో లేదు. దీంతో భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందేవరకు ఈ టీకా ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.

రష్యా రూపొందించిన ‘స్పుత్నిక్‌ లైట్‌’ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారు చేసేందుకు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) ఇక్కడి హెటెరో బయోఫార్మాతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా హెటెరో బయోఫార్మా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో భారత్‌లో ఈ టీకా వినియోగానికి అనుమతి పొందనందున వీటిని రష్యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రష్యా విదేశాంగ భారత్‌ను కోరింది. వారి అభ్యర్థన మేరకు హెటెరో తయారు చేసిన 40లక్షల డోసులను ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు భారత్‌లో స్పుత్నిక్‌ లైట్‌ వినియోగ అనుమతి కోసం డాక్టర్‌ రెడ్డీస్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గతకొన్ని నెలలుగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌తోపాటు ఇతర తయారీ సంస్థలు నెలవారీ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ఇదే సమయంలో వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లకు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII)కు అనుమతించింది. మరో ప్రముఖ సంస్థ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ 10లక్షల డోసులను ఇరాన్‌కు సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటితోపాటు రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ తయారీ కూడా భారత్‌లో కొనసాగుతోంది. ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో తయారైన స్పుత్నిక్‌ లైట్‌ సింగిల్‌ డోసు టీకా 79శాతం సమర్థత కలిగి ఉన్నట్లు రష్యా ప్రయోగాల్లో వెల్లడైంది. భారత్‌లో వీటి మూడో దశ ప్రయోగాలను మాత్రం డాక్టర్‌ రెడ్డీస్‌ నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని