Helicopter Crash: వరుణ్ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్‌ కెప్టెన్ వరుణ్ సింగ్(39) అంత్యక్రియలు భోపాల్‌లో శుక్రవారం ముగిశాయి. ఆయన కుటుంబ సభ్యులు వరుణ్‌కి తుది వీడ్కోలు పలికారు.

Updated : 21 Nov 2022 16:46 IST

దిల్లీ: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్‌ కెప్టెన్ వరుణ్ సింగ్(39) అంత్యక్రియలు భోపాల్‌లో శుక్రవారం ముగిశాయి. ఆయన కుటుంబ సభ్యులు వరుణ్‌కి తుది వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరిగాయి. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సహా పలువురు నివాళులు అర్పించారు. కాగా, వరుణ్ కుటుంబానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.

డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనలో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వరుణ్ సింగ్ మాత్రమే తీవ్ర గాయాలతో అధికారులకు కనిపించారు. ఆయన్ను బెంగళూరు తరలించి కమాండ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. గాయాల నుంచి కోలుకోలేని ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ప్రధాని సహా ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

 

వరుణ్‌ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భారత వాయుసేనలో వరుణ్‌ విశేష సేవలందించారు. గతేడాది తాను నడుపుతున్న తేజస్‌ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ.. ఎంతో నైపుణ్యం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఇందుకు గానూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని