Corona Vaccine: జులైలో 13 కోట్లకుపైగా డోసులిచ్చాం..!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం జులై నెలలోనే 13కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

Published : 01 Aug 2021 18:20 IST

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం జులై నెలలోనే 13కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ఆగస్టు నెలలో ఈ ప్రక్రియ మరింత వేగం కానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల కృషికి గర్విస్తున్నామన్నారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగుతుందంటూ రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘జులై నెలలో వ్యాక్సిన్‌ తీసుకున్న 13కోట్ల మందిలో మీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మీరు మన శాస్త్రవేత్తల గురించి కానీ, ప్రజలను వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రోత్సహించడం లేదు. దీన్నిబట్టి చూస్తే వ్యాక్సినేషన్‌పై మీరు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అర్థమవుతోంది. వ్యాక్సిన్‌కు కాదు, మీకు పరిపక్వత లేదు’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బదులిచ్చారు. అంతకుముందు దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిందని పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు. జులై ముగిసినా.. వ్యాక్సిన్‌ కొరత మాత్రం తీరలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌లు ఎక్కడా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, రాహుల్‌ గాంధీ తీరుపై మండిపడ్డారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 47.02కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 60లక్షల డోసులను అందించినట్లు పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే దేశంలో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మెగా డ్రైవ్‌ ప్రారంభించిన జూన్‌ నెలలో దాదాపు 11కోట్ల డోసులను పంపిణీ చేయగా.. జులై నెలలో 13కోట్ల డోసులు పంపిణీ చేస్తామని ముందుగానే తెలిపింది. మొత్తానికి జులై చివరి నాటికి 51కోట్ల డోసులను అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయాలనే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నట్లేనని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని