Omicron: కొత్త వేరియంట్‌ను ప్రస్తుత టీకాలు ఎదుర్కొంటాయా..?

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్ రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి.

Published : 01 Dec 2021 01:39 IST

వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఏమంటున్నాయంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు కొత్త వేరియంట్ రూపంలో సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఒమిక్రాన్‌ రూపంలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్‌ యావత్‌ ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతోంది. అయితే, అంతకుముందు ప్రమాదకర వేరియంట్‌గా వ్యాప్తిలో ఉన్న డెల్టాను సైతం కొవిడ్‌ వ్యాక్సిన్‌లు సమర్థంగా ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఈ ఒమిక్రాన్‌ను వేరియంట్‌ను ఎదుర్కొంటాయా? లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంశంపై వివిధ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు స్పందన ఇలా ఉంది.

ప్రస్తుత టీకాలతో కష్టమే..: మోడెర్నా

విస్తృత వేగంతో వ్యాపించే ప్రమాదముందని భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ప్రస్తుతమున్న వ్యాక్సిన్‌లు ఎదుర్కోవడం కష్టమేనని ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ ‘మోడెర్నా’ సీఈఓ ఫ్టీఫెన్‌ బన్సెల్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను సంప్రదించిన శాస్త్రవేత్తలందరూ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయినప్పటికీ వీటిపై మరో రెండు వారాల్లో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని స్టీఫెన్‌ బన్సెల్‌ తెలిపారు.

టీకాలతో రక్షణే : ఆస్ట్రాజెనెకా

ఇక ఆస్ట్రాజెనెకా టీకా తయారు చేసిన యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ కూడా ఒమిక్రాన్‌పై స్పందించింది. ఈ వేరియంట్‌ను టీకాలు సమర్థంగా ఎదుర్కోలేవని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి ఇప్పటివరకు స్వల్ప సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని.. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సమర్థతపై ఓ నిర్ధారణకు రాలేమని తెలిపింది. తమ వ్యాక్సిన్‌పై ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నామని.. అవసరమైతే ఈ వేరియంట్‌ను ఎదుర్కొనే విధంగా తమ టీకాను నవీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. గత ఏడాదికాలంగా చూసినట్లయితే.. కొత్తగా వెలుగు చూసే అన్ని వేరియంట్ల నుంచి వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తున్నాయనే విషయం మాత్రం స్పష్టమవుతోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పేర్కొంది.

మరో రెండు వారాలు : సీరం సీఈఓ

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ ఆందోళనలు నెలకొన్న వేళ.. కొవిషీల్డ్‌ టీకా పనితీరుపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదర్‌ పూనావాలా స్పందించారు. ఈ వేరియంట్‌ను తమ వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌) ఏ మేరకు ఎదుర్కొంటోందనే విషయం తెలుసుకునేందుకు మరో రెండు వారాలు పడుతుందని ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో డెల్టా వేరియంట్‌పై ప్రభావంతంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. ఒమిక్రాన్‌పై ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారని చెప్పుకొచ్చారు.

ఇలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఏమేరకు ఎదుర్కొంటాయే తెలుసుకునేందుకు వివిధ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మోడెర్నా, ఆక్స్‌ఫర్డ్‌తో పాటు అమెరికా వ్యాక్సిన్‌ సంస్థ ఫైజర్‌, రష్యన్‌ వ్యాక్సిన్‌ సంస్థ స్పుత్నిక్‌లు కూడా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై టీకాల ప్రభావాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నామని వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని