
అఫ్గాన్ నుంచి భారత్‌కు 104 మంది రాక.. హిందూ మత గ్రంథాలు కూడా
దిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న అఫ్గానిస్థాన్ నుంచి పలువురు భారతీయులతో పాటు.. అఫ్గాన్ పౌరులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చింది. ‘ఆపరేషన్ దేవీ శక్తి’లో భాగంగా ప్రత్యేక విమానంలో 104 మంది శుక్రవారం దిల్లీ విమానాశ్రానికి చేరుకున్నారు. వీరిలో కాబుల్ నుంచి 10 మంది, ఇతర ప్రాంతాల నుంచి మిగతా వారు వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం భారతీయులను తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ దేవీ శక్తిని ప్రారంభించిందని గుర్తుచేశారు.
‘ఈ విమానంలో అఫ్గానిస్థాన్‌లోని హిందూ-సిక్కు మైనారిటీకి చెందిన 10 మంది భారతీయులు సహా.. 94 మంది అఫ్గాన్ పౌరులను సురక్షితంగా తీసుకొచ్చాం. వీరిలో 9 మంది చిన్నపిల్లలు, ముగ్గురు శిశువులు ఉన్నారు’ అని అరిందమ్ బాగ్చి వెల్లడించారు. ప్రయాణికులతో పాటు అఫ్గాన్ నుంచి గురుగ్రంథ్ సాహిబ్ రచనలు, మూడు కాపీల హిందూ మత గ్రంథాలను కూడా కేంద్రం తీసుకొచ్చింది. అఫ్గాన్‌లోని చారిత్రక గురుద్వారాల నుంచి 3 శ్రీగురుగ్రంథ్ సాహిబ్ రచనలు సహా.. కాబూల్‌లోని పురాతన 5వ శతాబ్దపు అసమై మందిర్ నుంచి రామాయణం, మహాభారతం, భగవద్గీతతోపాటు హిందూ మత గ్రంథాలు కూడా తీసుకొచ్చారు. అనంతరం వాటిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, భాజపా చీఫ్ జేపీ నడ్డా తలపై పెట్టుకొని మోశారు. వాటిని పలు ఆలయాల్లో భద్రపరుచనున్నారు.
ఇవీ చదవండి
Advertisement