Delta Variant: చిన్నారులపై ‘డెల్టా వేరియంట్‌’ ప్రభావమెంత..?

చిన్నారులపై డెల్టా వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Published : 24 Sep 2021 01:19 IST

అమెరికా నిపుణులు ఏమంటున్నారంటే..

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. ఎక్కువ దేశాల్లో డెల్టా వేరియంట్‌ ప్రాబల్యమే అధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, అధిక సంక్రమణ కలిగిన ఈ వేరియంట్‌పై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సమర్థంగానే ఎదుర్కొంటున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఈ వేరియంట్‌ ప్రభావం ఏ విధంగా ఉందన్న అంశంపై ఆందోళన నెలకొంది. అయితే, చిన్నారులపై డెల్టా వేరియంట్‌ తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఇప్పటివరకు ఎలాంటి రుజువులు లేవని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నందున పిల్లల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయని.. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే దాఖలాలు లేవని పేర్కొంటున్నారు.

డెల్టా వేరియంట్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా ముందు ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొవిడ్‌ బారినపడుతున్న చిన్నారుల అక్కడ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత కొంతకాలంగా ప్రతివారం 2లక్షలకు పైగా చిన్నారులు పాజిటివ్‌గా తేలుతున్నట్లు అమెరికా అకాడెమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 50లక్షల మంది చిన్నారులు వైరస్‌ బారినపడినట్లు పేర్కొంది. అయితే, వైరస్‌ బారినపడిన ప్రతి లక్ష మంది చిన్నారుల్లో కేవలం 2శాతం మందికి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోందని అమెరికా సీడీసీ వెల్లడించింది. ఇలా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిన వారిలో డెల్టా వేరియంట్‌ ప్రభావమే ఎక్కువగా కనిపించినప్పటికీ.. వారిలో ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు డెల్టా వేరియంట్‌ నుంచి రక్షణ కల్పిస్తున్నాయని అమెరికా సీడీసీ వెల్లడించింది. 12ఏళ్ల వయసు పైబడిన పిల్లల్లోనూ వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో పోలిస్తే.. తీసుకోని వారిలోనే ఆస్పత్రిలో చేరే ప్రమాదం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందుకే అత్యంత తేలికగా వ్యాప్తి చెందే సామర్థ్యం డెల్టా వేరియంట్‌కు ఉన్నందున స్కూళ్లలో మాస్కులు వాడకం, పెద్దవారికి టీకాలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉందని ఫ్లోరిడాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ ఆస్పత్రిలో పిల్లల విభాగాధిపతి డాక్టర్‌ జూవాన్‌ డుమోయిస్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని