
US: మహిళల లోదుస్తుని మాస్కుగా ధరించి విమానంలోకి.. నిషేధం విధించిన ఎయిర్‌లైన్స్
ఫ్లోరిడా: బోర్డింగ్ పాస్, కరోనా నెగెటివ్ రిపోర్ట్ చూపించిన ప్రయాణికులందరూ విమానంలోకి ఎక్కేశారు. ప్రతిఒక్కరు కొవిడ్ నిబంధలు పాటిస్తున్నారా? మాస్కులు ధరించారా? అని సిబ్బంది చెక్ చేస్తుండగా ఓ వ్యక్తి మాత్రం మహిళలు ధరించే లోదుస్తుని మాస్కుగా ధరించడం చూసి షాక్‌కు గురయ్యారు. ఇందుకు అతడు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు.
అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్‌డేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానంలో ఓ ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళల లోదుస్తు(థోంగ్)ను మాస్కుగా ధరించి తన సీట్లో కూర్చున్నాడు. ఇది గమనించిన విమాన సిబ్బంది దాన్ని తొలగించి మాస్కును ధరించాలని కోరగా జేన్ అందుకు ససేమిరా అన్నాడు. దీంతో సిబ్బంది అతడిని విమానంలో నుంచి దించేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
ఆడమ్ జేన్ చర్యపై ఎయిర్‌లైన్స్ సంస్థ చర్యలు తీసుకుంది. మాస్కు నిబంధనలను ఉల్లంఘించాడని పేర్కొంటూ.. అతడిపై నిషేధం విధించింది. ఈ అంశంపై సదరు ప్రయాణికుడు మాట్లాడుతూ.. విమానంలో తినేప్పుడు, తాగేటప్పుడు కూడా మాస్కును ధరించాలని సిబ్బంది సూచిస్తున్నారని.. దానికి నిరసనగా తాను ఈ పని చేసినట్లు పేర్కొన్నాడు. ‘దీనిపై నిరసన తెలిపేందుకు ఇదే ఉత్తమమైన మార్గంగా భావించా’ అని జేన్ పేర్కొన్నాడు. గతంలో ఓ విమానంలో తాను ఇలాగే ప్రయాణించానని, అది మాస్కులా పనిచేస్తుందని సిబ్బంది తనను ఏం అనలేదని చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.