Published : 17/11/2021 14:06 IST

Delhi Pollution: ‘టీవీ చర్చలే మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’

దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టులో విచారణ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పంట వ్యర్థాలు దహనం చేయడంపై తాము రైతులకు శిక్షలు విధించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. వాటిని దహనం చేయకుండా రైతులను ఒప్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించామని వెల్లడించింది. అలాగే ఈ విషయంపై టీవీల్లో జరుగుతోన్న చర్చలపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

‘పంట వ్యర్థాలు దహనం చేయడంపై రైతుల్ని శిక్షించడం మాకు ఇష్టం లేదు. కనీసం ఒక వారం రోజుల పాటు వాటిని తగలబెట్టవద్దని రైతుల్ని కోరాలని ఇప్పటికే కేంద్రానికి సూచించాం. వీటన్నింటి కంటే టీవీల్లో చర్చాకార్యక్రమాలే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరి అజెండా ప్రకారం వారు మాట్లాడుతున్నారు. ఈ సమస్యపై ఒక పరిష్కారం కోసం మేం ప్రయత్నిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దిల్లీ వాయుకాలుష్యంపై సీరియస్‌గా స్పందించారు. పంట వ్యర్థాల దహనంపై కేంద్రం, దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన మీదట ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో కూర్చొని కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారు. వారి వల్లే కాలుష్యం జరుగుతుందంటూ లెక్కలు వేస్తున్నారు. గణాంకాలు చెప్పి, పార్టీలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి తప్ప ఉపయోగం లేదు. మేం కాలుష్యాన్ని తగ్గించడం గురించే ఆలోచిస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తుంటాయి. మీ  మనస్సాక్షి సరిగా ఉంటే అవేం పెద్ద సమస్యకాదు. వాటిని మర్చిపోండి. ఇతర విషయాలను లేవనెత్తితే.. అసలు సమస్య పరిష్కారం కాదు’ అని ప్రభుత్వాల వైఖరిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది 

అలాగే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని దిల్లీ ప్రభుత్వం కోర్టును కోరింది. కేంద్రం మాత్రం ప్రభుత్వోద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌  హోం విధించడంపై విముఖత చూపింది. ఇప్పటికే కరోనా కారణంగా పనులు వాయిదా పడి, ఇబ్బంది పడుతున్నట్లు కోర్టుకు వెల్లడించింది. కాగా, దీనిపై తదుపరి విచారణ నవంబర్ 23కు వాయిదా పడింది. దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా దిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కాలుష్య కట్టడికి మంగళవారం రాత్రి ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) తక్షణమే అమలులోకి వచ్చేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని