PM Security Breach: ‘మోదీ కాన్వాయ్ ఆపింది మేమే’.. ఎస్ఎఫ్​జే నుంచి ఫోన్‌కాల్స్‌!

పంజాబ్​లో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం......

Published : 11 Jan 2022 01:31 IST

సుప్రీంకోర్టుకు నివేదించిన న్యాయవాదుల సంఘం

దిల్లీ: పంజాబ్​లో రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ ప్రకటించుకున్నట్లు సమాచారం. ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్​జే) నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి నివేదించింది. మోదీ కాన్వాయ్​ను అడ్డగించింది తామేనని ఎస్ఎఫ్​జే పేర్కొందంటూ..  సోమవారం ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై ఎన్​జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపవద్దని న్యాయమూర్తులనూ బెదిరించారని వివరించింది.

‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్​వాలా ఫ్లైఓవర్​పై మోదీ కాన్వాయ్​ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేలాది మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్​కాల్​లో హెచ్చరించారు’ అని న్యాయవాదుల సంఘం ధర్మాసనానికి లేఖ రాసింది.

విచారణ చేపడితే జాతీయ భద్రత, సమగ్రతను దెబ్బతీసే అత్యంత ప్రతికూల చర్యలు ఎదుర్కొంటారని భయపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అడ్వకేట్లు తమ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని, వారి ఫోన్లు హ్యాకింగ్‌కు గురైతే ఇవన్నీ దుర్వినియోగమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులందరికీ ఇలాంటి కాల్స్‌ వస్తున్నాయంటూ దీపక్‌ ప్రకాశ్‌ అనే లాయర్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని